జగన్ తీరుపై ఆయన శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ విసిగిపోయారు. ఎంత మంచి చెప్పినా వినిపించుకోవడం లేదని.. ఆయనకు బాగుపడే లక్షణాలు లేవని .. ఆయన మంచి కోరుకునే పెద్దమనిషిలా బాధపడిపోతున్నారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఏపీకి మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ అసెంబ్లీకి పోకపోవడం ఏమిటని ఉండవల్లి ఆశ్చర్యపోయారు. ఆయన ఇప్పుడే కాదు.. ఏడాదిన్నర నుంచి పోవడంలేదని ఉండవల్లికి తెలియదేమో కానీ.. పదకొండు మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే సమావేశాల్లో అయినా అసంబ్లీకి వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆయన పోతాడని నమ్మకం లేకపోవడంతో పవన్ కల్యాణ్ ప్రతిపక్ష పోషించాలని పిలుపునిస్తున్నారు. అలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయన్నారు.
కూటమిని విడదీస్తేనే తప్ప తనకు రాజకీయ భవిష్యత్ లేదనుకుంటున్న జగన్ రెడ్డి రాజకీయానికి.. ఉండవల్లి ఇలా సహకారం అందిస్తున్నారని అందరూ అనుకుంటారని.. తన లాయర్ తెలివితేటలు చూపించి.. కూటమి విడిపోవాలన్నది తన లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మంచి జరగడం అంటే ఏమిటో ఆయన చెప్పడం లేదు.
జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అత్యంత ఘోరంగా నాశనం చేస్తే.. పునాదులు పెకిలిస్తే ఒక్క నాడు కూడా ఇది తప్పు అని చెప్పలేదు. మార్గదర్శి కోసం.. జగన్ రెడ్డితో సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున అప్పీల్ చేయించిన ఆయన.. విభజన చట్టంపై మాత్రం కౌంటర్ దాఖలు చేయించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం కౌంటర్ చేయాలని అంటున్నారు. ఉండవల్లి లాయరే కానీ.. అసలు పనికి మాలిన..పనికి రాని విషయాలపై ప్రభుత్వం పోరాటం చేయాలని అనుకోవడమే విచిత్రంగా ఉంది. దాన్నుంచి ఆయన రాజకీయం కోరుకుంటున్నారు.