కేంద్ర బడ్జెట్ 2026లో రియల్ ఎస్టేట్ రంగం కోరుకుంటున్న అంశాలను పట్టించుకోలేదు. ముఖ్యంగా మధ్యతరగతి సొంతింటి కల సాకారం కావాలంటే గృహ రుణాల వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతారని అందరూ భావించారు. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయకపోవడం నిరాశ పరిచింది. పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు, వడ్డీ రేట్ల నేపథ్యంలో ఈ మినహాయింపు పెంచకపోవడం వల్ల సామాన్యుడిపై ఈఎంఐ భారం యథాతథంగా కొనసాగనుంది.
రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక పరిశ్రమ గా గుర్తించాలనే దశాబ్దాల కాలం నాటి డిమాండ్‌ను ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. పరిశ్రమ హోదా దక్కితే తక్కువ వడ్డీకే రుణాలు లభించడంతో పాటు, పెట్టుబడుల ప్రవాహం పెరిగి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉండేది. ఈ వెసులుబాటు కల్పించకపోవడంతో బిల్డర్లు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి రావడం, ఆ భారం చివరకు వినియోగదారుడిపైనే పడుతుంది.
అయితే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించడమే కాకుండా, పీఎం ఆవాస్ యోజన కోసం సుమారు రూ. 18,625 కోట్లు కేటాయించడం కొంత ఊరటనిచ్చే అంశం. పట్టణ ప్రాంతాల్లో అఫర్డబుల్ హౌసింగ్ పరిమితిని రూ. 45 లక్షల నుండి రూ. 75 లక్షలకు పెంచాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. మెట్రో నగరాల్లో రూ. 45 లక్షలకు ఇల్లు దొరకడం గగనంగా మారిన తరుణంలో, ఈ పరిమితిని సవరించకపోవడం వల్ల ప్రభుత్వ సబ్సిడీ పథకాలు చాలామందికి అందకుండా పోతున్నాయి.
బడ్జెట్లో హైస్పీడ్ రైల్ కారిడార్లు, కొత్త జాతీయ జలమార్గాలు , పట్టణాభివృద్ధి కోసం రూ. 85,522 కోట్లు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో భూముల విలువ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, తక్షణ డిమాండ్‌ను పెంచే చర్యలు మాత్రం లోపించాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. . టైర్-2, టైర్-3 నగరాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు లేకపోవడం, నిర్మాణ సామాగ్రి ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం నిరాశకు గురయింది.
