సినిమాల్లో విలక్షణ దర్శకుడు నటుడు రచయితగా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర.. తన ఆలోచనలని రాజకీయాల వైపు కూడా మళ్లించారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ పేరుతో ఓ పార్టీ పెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క సీట్ కూడా రాలేదు. కాకపొతే అందరూ చేసే రాజకీయం ఆయనది కాదు. అసలు ఎన్నికల ప్రచారమే చేయలేదు. ఈ డిజిటల్ కాలంలో కూడా సాంప్రదాయ ప్రచారం వద్దు అనుకున్నారు. తన మానిఫెస్టోని అన్ లైన్ లోనే విడుదల చేశారు. అయితే ఆయన సినిమాలానే ఆయన ఆలోచనలు, విధానాలు జనానికి సరిగ్గా అర్ధం కాలేదు.
ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్ లో తెలుగు 360 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పొలిటికల్ జర్నీ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ప్రజలు గెలవాలి, కానీ ఇక్కడ నాయకులు గెలుస్తున్నారు. ఆలోచనకి ఓటు వేయాలి కానీ ఒక మనిషికి ఓటు వేస్తున్నారు. ప్రజల డబ్బుతో దేశం నడుస్తోంది. ప్రతి రూపాయి ఎలా ఖర్చు అవుతుందో మనకి ముబైల్ లో కనిపించే వ్యవస్థ రావాలి. అలాంటి వ్యవస్థ కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఉపేంద్ర ఐడియాలజీ బానే వుంది, కాకపొతే అదొక సినిమాలో హీరో ఆలోచనలానే వుంది. ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే ఆ వ్యవస్థలోకి వెళ్లి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలి. కానీ ఉపేంద్ర మాత్రం కేవలం ఐడియాలజీతోనే వున్నారు.
ఈ ఐడియాలజీ ఆచరణలో పెట్టాలన్నా, ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలన్నా గ్రౌండ్ లెవల్ లో పని చేయాలి. క్యాడర్ ని డెవలప్ చేసుకోవాలి. కాకపోతే ఉపేంద్ర అసలు ఈ సంప్రదాయ రాజకీయాలే వద్దు అనుకుంటున్నారు. ఉపేంద్ర రాజకీయ ప్రయాణం ఓ ఫార్ములా ఫాలో అయ్యే రెగ్యులర్ కథ కాదు. ఇది ఆయన సినిమాల్లాగే ఎక్స్పెరిమెంట్, కొత్త ఆలోచనల ప్రయోగశాల. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా వెంటనే ఫలితాలు ఇచ్చేవి కావు. ఆయన ఆలోచనలకి ప్రజల వేవ్లెంగ్త్ కుదిరే రోజు ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి.

