వయసు మీరిపోయిన మావోయిస్టు నాయకుల మధ్య సమర్థుడిగా దూసుకొచ్చిన యువ నాయుకుడు హిడ్మాను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఆయనకు మద్దతుగా ఇప్పుడు కొంత మంది గ్రూపుల్లో, సోషల్ మీడియాలో సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనను హీరోగా కీర్తిస్తున్నారు. నిజం చెప్పాలంటే హిడ్మా ఎన్ కౌంటర్ ను వాడుకుని మరింత మందిని అడవుల్లోకి పంపేందుకు.. రిక్రూట్ మెంట్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఇలాంటి కుట్రలతోనే చాలా మంది హిడ్మా లాంటి యువత జీవితాలను నాశనం చేస్తున్నారు.
ప్రజా జీవితంలోకి హిడ్మా వచ్చి ఉంటే ప్రజలకు మంచి నాయకత్వం
అడవుల్లో ఉండి రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాదని కొత్త, ఆధునిక ప్రపంచంంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రాజ్యం బలోపేతమయింది. ఇలాంటి సమయంలో వారికి ఉన్న ఆప్షన్ ప్రజాస్వామ్యమే. హిడ్మా లాంటి సమర్థులైన నాయకత్వం ప్రజాస్వామ్యం ద్వారా తాము అనుకున్న లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేయించేలా మోటివేట్ చేసి ఉంటే ఆయన మంచి ప్రజా నాయకుడు అయి ఉండేవారు. కానీ ఆయనను రెచ్చగొట్టి.. ఆయుధాలు వదిలేది లేదని .. దాడులకు పురికొల్పి చివరికి ఎన్ కౌంటర్ తప్ప మరో మార్గం లేకుండా చేశారు.
మరణించిన తర్వాత కూడా హిడ్మాను మార్కెటింగ్ చేస్తున్న అర్బన్ నక్సల్స్
హిడ్మాను ఎన్ కౌంటర్ చేస్తే.. బయట పెద్దగా ఎవరూ ఈ అర్బన్ నక్సల్స్ నిరసనలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయనను హీరోను చేస్తున్నారు. హిడ్మా సొంత ఊరు.. ఆయన గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నిస్వార్థంగా ఉద్యమం చేశారని చెబుతున్నారు. ఆయన తాను ఎంచుకున్న రంగంలో వేగంగా ఎదిగారు. అందులో సందేహం లేదు. కానీ కొన్ని వందలమందిని చంపడంలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ ఆయనకు లొంగిపోయే అవకాశాలు కల్పించారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. ఉద్యమం మనలేదని తెలిసినప్పుడు లొంగిపోయేలా.. ఆయనకు మార్గదర్శనం చేసే అర్బన్ నక్సల్స్ నచ్చచెప్పాల్సి ఉంది. కానీ ఎన్ కౌంటర్ అయ్యే వరకూ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆయన మరణాన్ని మార్కెటింగ్ చేస్తూ మావోయిస్టులపై సానుభూతి పెంచుతున్నారు.
అర్బన్ నక్సల్స్ ఎంత మంది జీవితాలను నాశనం చేస్తారు?
మావోయిస్టుల ఉద్యమం గొప్పదని ఉద్యమాలు చేసే వాళ్లు.. ఒక్కరు కూడా అడవుల్లోకి వెళ్లరు. కానీ వాళ్లకు మద్దతుగా మాట్లాడి, పోస్టులు పెట్టి తమను తాము విప్లవకారులుగా చెప్పుకుంటారు. వారు మాత్రం సకల సౌకర్యాలతో మంచి జీవితాన్ని గడుపుతూంటారు. పిల్లలను చదివించుకుని అమెరికాకు పంపుతూంటారు. కానీ ఈ నక్సల్స్ మాత్రం అడవుల్లోనే ఉండాలి. కుటుంబాలను కూడా పట్టించుకోకూడదు. ఇలాంటి తత్వం ఉన్న వారితోనే హిడ్మాలు లాంటి వాళ్లను కోల్పోవాల్సి వస్తోంది.