యురీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తానీ కళాకారులందరూ 48 గంటల్లో భారత్ నుంచి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. బీజేపీ కూడా పాకిస్తాన్ సినీ నటీనటులపై కన్నెర్ర చేసింది. ఏ దిల్ హై ముష్కిల్, రయీజ్ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది.
రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడు. అది కూడా అతిథి పాత్ర లాంటిది. అయినా, ఆ పాత్రను పూర్తిగా తొలగించకపోతే సినిమా విడుదలనుఅడ్డుకుంటామని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించారు.
షారూఖ్ ఖాన్ నటిస్తున్న రయీజ్ సినిమాలో పాకిస్తానీ నటి మహీరా ఖాన్ హీరోయిన్. కాబట్టి ఆ సినిమాలో ఆమె కనిపిస్తే విడుదలకు బ్రేకు వేస్తామని కమలనాథులు హెచ్చరించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నారు.
తరచూ జరుగుతున్న ఉగ్రదాడులపై మహారాష్ట్రలోని మూడు పార్టీల నేతలూ తీవ్రంగా స్పందించారు. శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో పాటు బీజేపీ నాయకులు పాకిస్తాన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తానీ కళాకారులే కాదు, క్రీడాకారులు మాజీ క్రీడాకారులు కూడా టార్గెట్ చేయాలని కాషాయ దళం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, సినిమాల విడుదల సమయంలో నిర్మాతలు కోరితే తగినంత భద్రత కల్పిస్తామని ముంబై పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎంత భద్రత కల్పించినా ఏదో ఒక చోట అలజడి రేపడం అసాధ్యమేం కాదు. కాబట్టి ఈ సినిమాల వివాదానికి సంబంధించి క్లయిమాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం.