అమెరికా యుద్ధం చేస్తోంది. ఇరాన్‌ను సర్వనాశనం చేసినప్పటికీ ఆ దేశం విజయం సాధించినట్లు కాదు. పైగా ఓడిపోయినట్లు అవుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల అమెరికా ఎన్నో సమస్యలు ఎదుర్కోబోతోంది. ఈ వార్ అమెరికా ఖజానాపై ఇది వందల బిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుంది. అత్యాధునిక క్షిపణులు, విమాన ఇంధనం , సైనిక మోహరింపు ఖర్చులు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. అంతకంటే ముఖ్యంగా, ఇరాన్ హోర్ముజ్ జలసంధిని వాడకుండా చేస్తే అంతర్జాతీయ చమురు సరఫరా ఆగిపోయి బ్యారెల్ ధర 150* దాటే ప్రమాదం ఉంది. ఇది అమెరికాలో గ్యాసోలిన్ ధరలను పెంచి, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని స్థాయికి తీసుకెళ్తుంది.
అమెరికాకు దిన దిన గండమే
ఇరాన్‌ను ఓడించడం అంటే ఆ దేశ పాలనను కూల్చడం అని కాదు. యుద్ధం తర్వాత ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా, హూతీలు ఇతర ప్రాక్సీ గ్రూపులు అమెరికా స్థావరాలపై గెరిల్లా దాడులను తీవ్రతరం చేస్తాయి. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అనుభవాల దృష్ట్యా, అమెరికా మళ్ళీ మధ్యప్రాచ్యంలో దశాబ్దాల పాటు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. గెలిచిన తర్వాత అక్కడ శాంతిని నెలకొల్పడానికి చేసే ఖర్చు, యుద్ధం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది అమెరికా వ్యూహాత్మక వనరులను హరించివేస్తుంది.
చైనా, రష్యాలకు అందివచ్చే అద్భుత అవకాశం
అమెరికా తన పూర్తి శక్తిని ఇరాన్‌పై కేంద్రీకరిస్తున్న సమయంలో, అటు రష్యా ఉక్రెయిన్లోనూ, ఇటు చైనా తైవాన్ లేదా దక్షిణ చైనా సముద్రంలోనూ తమ పట్టును పెంచుకునే అవకాశం ఉంటుంది. అమెరికా దృష్టి మళ్లడం వల్ల ఈ దేశాలు తమ భౌగోళిక లక్ష్యాలను సులువుగా చేరుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఇరాన్ యుద్ధం అమెరికాను బలహీనపరిచి, ప్రపంచ అగ్రరాజ్య హోదాను సవాలు చేసేలా చైనాకు మార్గం సుగమం చేస్తుంది. ఇది అమెరికాకు జరిగే అతిపెద్ద దీర్ఘకాలిక నష్టం.
దౌత్యపరమైన ఒంటరితనం
ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై అమెరికా తన నైతిక బలాన్ని కోల్పోయింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికాను ఒక దురాక్రమణదారు గా చూసే ప్రమాదం ఉంది. ఐరోపా మిత్రదేశాలు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ యుద్ధంలో అమెరికాకు వచ్చే లాభం ఇరాన్ అణు సామర్థ్యాన్ని అణచివేయడం మాత్రమే కావచ్చు. కానీ, దానికి బదులుగా అమెరికా చెల్లించే ఆర్థిక, సైనిక , దౌత్యపరమైన ధర అత్యంత ఖరీదైనది.పూడ్చుకోవడం అంత తేలిక కాదు.


