అమెరికా సైన్యం వెనిజులాపై మెరుపు దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బంధించి అమెరికాకు తరలించారు. వెనిజులాను తామే పరిపాలిస్తామని సగర్వంగా ట్రంప్ ప్రకటించారు. అక్కడి ఆయిల్ తో తమ కంపెనీలు వ్యాపారం చేస్తాయని కూడా ప్రకటించారు. ఇదంతా ఆక్రమణ తప్ప మరొకటి కాదు. వెనిజులాలో నియంతృత్వం అని.. డ్రగ్స్ అని ఏ కారణాలు చెప్పినా.. అమెరికా చేసింది మాత్రం దురాక్రమణే.
అమెరికా చేసింది చట్ట ఉల్లంఘన
ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం, ప్రతి దేశానికి తన స్వంత సార్వభౌమాధికారం ఉంటుంది. ఒక దేశం మరొక దేశంపై దాడి చేసి, అక్కడి ప్రభుత్వాధినేతను బంధించి తామే పరిపాలన చేస్తాం అనడం అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా తీవ్రమైన ఉల్లంఘన గానే భావిస్తారు. అమెరికా దీనిని నార్కో-టెర్రరిజం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో సమర్థించుకుంటున్నప్పటికీ, ఒక స్వతంత్ర దేశ అంతర్గత వ్యవహారాల్లో సైనిక జోక్యం చేసుకోవడం ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యగానే మిగిలిపోతుందనేది ఎక్కువ మంది అభిప్రాయం.
ఇతర దేశాలు ఇదే పని చేస్తే అరాచకమే !
అగ్రరాజ్యాలు ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు, అది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాదకరమైన ధోరణిని సెట్ చేస్తుంది. బలవంతుడిదే రాజ్యం అనే సూత్రం అమలైతే, చిన్న దేశాల ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అమెరికా చేస్తున్న ఈ పని ఇతర దేశాలకు ఆదర్శంగా కాకుండా, అంతర్జాతీయ వ్యవస్థలో అస్థిరతకు దారితీసే ఒక తప్పుడు సంకేతంగా మారుతుంది. అమెరికా చర్యను సాకుగా చూపి చైనా రేపు తైవాన్ పై ఇదే తరహాలో దాడి చేస్తే అడగడానికి అమెరికాకు నైతిక హక్కు ఉండదు. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ పై చేస్తున్న దాడిని కూడా ఇలాంటి నియంతృత్వ నిర్మూలన లేదా రక్షణ కారణాలతోనే సమర్థించుకుంటుంది. అమెరికా స్వయంగా ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినప్పుడు, రష్యా గానీ, చైనా గానీ తమ సరిహద్దుల్లోని దేశాలపై ఇటువంటి దాడులు చేస్తే ప్రపంచం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అరాచకత్వానికి దారితీస్తుంది.
వెనిజులాలో మరింత అరాచకం.. అమెరికాకూ సమస్యలే!
ఒక దేశంలో మార్పు అనేది ఆ దేశ ప్రజల ద్వారా రావాలి తప్ప, బయటి శక్తుల ద్వారా కాదు. అమెరికా గతంలో పనామా, ఇరాక్ వంటి దేశాల్లో ఇటువంటి ప్రయోగాలు చేసినా, అక్కడ దీర్ఘకాలిక శాంతి నెలకొనలేదు. వెనిజులా విషయంలో కూడా అమెరికా తానే పరిపాలన చేస్తాననడం వల్ల ఆ ప్రాంతంలో అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉంది. ఇది కేవలం వెనిజులాకే కాకుండా, దక్షిణ అమెరికా ఖండం మొత్తానికి భద్రతా పరమైన ముప్పుగా పరిణమిస్తుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ భౌగోళిక రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇది ప్రజాస్వామ్య స్థాపన కంటే, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కే చర్యగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది.
