అమెరికా ఖజానాకు .. ట్రంప్ విధించిన సుంకాల వల్ల దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చి చేరాయని సంబర పడుతున్నారు. దీని వల్ల బిగ్ అండ్ బ్యూటీఫుల్ బిల్లు అమలుకు కావాల్సిన డబ్బులు సమకూరుతాయని అంటున్నారు. ట్రంప్ వీటన్నింటినీ ఇతర దేశాల నుంచి వసూలు చేస్తున్నట్లుగా నమ్మిస్తున్నారు. నిజానికి ట్రంప్ విధించే ప్రతి సుంకం అమెరికా ప్రజలపైనే. ఆ సెగ తగులుతోంది వారికే. ట్రంప్ ఖజానాకు చేరుతున్న ప్రతి రూపాయి అమెరికన్ల నుంచి వసూలు చేస్తున్నదే.
సుంకాలు వేసేది దిగుమతులపై…దేశాలపై కాదు !
ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా వదలకుండా ట్రంప్ సుంకాలు విధిస్తున్నారు. భారత్ పై కాస్త ఎక్కువ విధించారు. ఎక్కువా.. తక్కువా అన్నది సమస్య కాదు.. ప్రతి దేశంపై సుంకాలు విధించారు. అమెరికాలో తయారీ పరిశ్రమ లేదు. అక్కడ తయారీ అంటే.. అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం . అందుకే దాదాపుగా వారి వినియోగ వస్తువుల్లో సగానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఇప్పుడు వాటన్నింటిపై పన్నులు విధిస్తే కట్టాల్సింది.. వాటిని కొనుగోలు చేసే అమెరికన్లు. దేశాలపై పన్నులు విధించేంత అధికారం అమెరికాకు లేదు.
బలవుతోంది అమెరికన్లే !
అమెరికా ప్రజలకు అవసరమైన వస్తువులు ఉత్పత్తి చేయలేనప్పుడు.. దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పన్నులు పెంచితే..దిగుమతి ఆపేయరు కదా. తప్పనిసరిగా కొనుక్కోవాల్సిన వాటిని అమెరికన్లు ధర ఎక్కువ అయినా.. ట్రంప్ విధించిన పన్నులను చెల్లించి అయినా కొనుక్కుంటారు. ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువుల క్వాంటిటీ తగ్గవచ్చేమో కానీ.. ఉత్పత్తులు మాత్రం ఆపకుండా ఉండలేరు. అలాంటివి వేరే దేశాల్లో చౌకగా లభిస్తే కొనుక్కుంటారేమో కానీ.. ఆపలేరు. ఇంతకు ముంద డాలర్‌కు కొంటున్న వస్తువు.. పన్నుల తర్వాత రెండు డాలర్లకు అమెరికన్లు కొంటున్నారు. ట్రంప్ సుంకాల వల్ల వచ్చిన తేడా అదే.
అమెరికా ప్రజల్లో పెరుగుతున్న అసహనం
ట్రంప్ తీరుతో ఆయన లాంటి విపరీత భావజాలం ఉన్న అతి కొద్ది మంది మినహా ఎక్కువ మందిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇటీవల ఆయన నాలుగు రోజులు బయటకు కనిపించకపోతే…. ట్రంప్ ఈజ్ డెడ్ అని వైరల్ చేసుకున్నారు. అంత ఘోరంగా ఆయనపై వ్యతిరేకత ఉంది. ఎవర్నీ ప్రశాంతంగా బతకనీయని ఆయన తీరుపై త్వరలో ప్రజా ఉద్యమం వచ్చినా ఆశ్చర్యం లేనట్లుగా పరిస్థితి మారుతోంది. ఇతర దేశాలపై పన్నుల పేరుతో తన దేశ ప్రజల్ని దోచుకుంటున్న అధ్యక్షుడి తెలివికి అమెరికన్లంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు.