ఈ వేసవిలో పెద్ద సినిమాల హడావుడి అస్సలు కనిపించడం లేదు. సినిమాలు కొన్ని బరిలో ఉన్నా – వాటి రిలీజ్ డేట్ విషయంలో చాలా చాలా కన్ఫ్యూజన్ వుంది. ముఖ్యంగా ‘పెద్ది’ రిలీజ్ ఆలస్యం అవుతోంది. మార్చిలో రావాల్సిన సినిమా ఇది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే వరకూ.. ‘పెద్ది’ ఎప్పుడు వస్తుందో తెలీదు. మార్చిలోనే రావాల్సిన `పారడైజ్` కూడా వెనక్కి వెళ్లింది. మే లేదా జూన్‌లో నాని సినిమా వస్తుంది. అంటే కీలకమైన మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీ సినిమా లేకుండానే గడిచిపోయే ప్రమాదం ఉంది.
అయితే ఇప్పుడు మార్చి 26న రావడానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సిద్ధంగా ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. అదే నిజమైతే పవన్ కల్యాణ్ సినిమాకు మంచి స్లాట్ దొరికినట్టే. మార్చిలో ‘టాక్సిక్’ తప్ప.. పెద్ద సినిమా లేదు. అది కూడా డబ్బింగ్ బొమ్మ. పవన్ కల్యాణ్ సినిమాకు పోటీ ఇస్తుందని చెప్పలేం. మార్చి చివరి వారం సమ్మర్ హడావుడి మొదలైపోతుంది. ‘ఉస్తాద్’ వస్తుందంటే మీడియం రేంజ్ సినిమాలు కూడా వెనక్కి వెళ్తాయి. ఎలా చూసినా… పవన్ కల్యాణ్ సినిమాకు గ్రౌండ్ ఖాళీ అయ్యిందని చెప్పొచ్చు. ఏప్రిల్ లో కూడా పెద్ద సినిమాలు పెద్దగా రాకపోవొచ్చు. ‘ఉస్తాద్’ కి మంచి టాక్ వస్తే… లాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో భరోసా ఏర్పడింది. పైగా హరీష్ శంకర్ పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడు. పవన్‌ని ఎలా చూపించాలో తనకు బాగా తెలుసు. సో.. ఈ సినిమాకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. పెద్ది, పారడైజ్ సినిమాల గ్యాప్‌ని `ఉస్తాద్` ఫిల్ చేయగలిగితే బాక్సాఫీసుకు కొంత ఉపశమనం దక్కుతుంది. ‘ఉస్తాద్’ రిలీజ్ డేట్ పై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
