వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గత వారం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. 147 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. అయితే ఆయనకు జైలులో ఉన్న సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలుమార్లు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. పలువురు ఆయనను కలుసుకునేందుకు వస్తూండటంతో మళ్లీ ఇన్ ఫెక్షన్ పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజే జగన్ ను కలిశారు. ఆ తర్వాత నుంచి వరుసగా పార్టీ నేతలు నచ్చి కలుస్తున్నారు. ఈ సమయంలో కూడా వంశీ అంత యాక్టివ్ గా ఉండటం లేదు. బిత్తర చూపులు చూస్తూ కనిపిస్తున్నారు. నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. కొత్తగా ఆయనకు శ్వాస సమస్యలు రావడంతో ఆస్పత్రికి తరలించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బెయిల్ షరతుల ప్రకారం ఆయన గన్నవరం నియోజకవర్గంలోనే ఉండాలి.
జైలు నుంచి విడుదలైన తర్వాత వైద్య పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం, చాలా మంది వచ్చి కలుస్తూండటంతో శ్వాస సమస్య రిపీట్ అయినట్లుగా చెబుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయనను కలిసేందుకు ఎవరూ రావొద్దని కుటుంబసభ్యులు కోరుతున్నారు.