తమిళనాడు రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. గతంలో రెండు కూటముల మధ్య పోరు సాగేది. ఈ సారి విజయ్ మరో రాజకీయ శక్తిగా పోటీ పడుతున్నారు. ఈ త్రిముఖ పోటీలో స్టాలిన్ లాభపడుతారని విశ్లేషణలు వస్తున్నాయి. విజయ్ అన్నాడీఎంకేతో కలిస్తే తిరుగు ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తులకు విజయ్ రెడీగానే ఉన్నారు. కానీ ఆయనకు సీఎం సీటు ఆఫర్ చేయడానికి పళనీ స్వామి రెడీగా లేరు. అందుకే విజయ్ పొత్తుల దిశగా ఎలాంటి చర్చలూ జరిపేందుకు ఆసక్తి చూపించలేదు.
పళనిస్వామి వర్సెస్ విజయ్
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలోనే ఈ రెండు శక్తులు కలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించవచ్చని సూచించారు. విజయ్ కోసం పనిచేసిన అనుభవంతో ఆయన రెండు పార్టీల మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేసినా, చివరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దగ్గరే చర్చలు ఆగిపోయాయి. ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పటికీ, అధికార పీఠం విషయంలో ఎవరూ తగ్గకపోవడం ఇప్పుడు రాజకీయాలను మార్చింది. ఈ పొత్తు పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణం విజయ్ ను నాయకుడిగా అన్నాడీఎంకే అంగీకరించకపోవడమే. సినీ గ్లామర్, భారీ జనాదరణ ఉన్న విజయ్, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే తప్ప పొత్తుకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న తాను, రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చిన విజయ్ కింద డిప్యూటీ సీఎంగా పనిచేయడం తన రాజకీయ భవిష్యత్తుకు, పార్టీ కేడర్ ఆత్మగౌరవానికి భంగకరమని భావించారు. ఫలితంగా చర్చలు మొదట్లోనే ఆగిపోయాయి.
సర్వేల లెక్కలు.. అన్నాడీఎంకే ధీమా
ఇటీవలి రాజకీయ సర్వేలు అన్నాడీఎంకే నేతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. విజయ్ పార్టీకి యువతలో క్రేజ్ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం , ఓటు బ్యాంకు పరంగా అన్నాడీఎంకే ఇప్పటికీ బలంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. విజయ్ పార్టీ కంటే తమకే ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పీఠాన్ని త్యాగం చేయడం తగదని పళనిస్వామి వర్గం గట్టిగా నమ్ముతోంది. ఈ బలమైన ఓటు బ్యాంకు అండతోనే, విజయ్ పెట్టిన నిబంధనలకు అన్నాడీఎంకే తలొగ్గడం లేదు. అన్నాడీఎంకే , విజయ్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. కూటమి కట్టేసింది.
పళనిస్వామి తగ్గితే అన్నాడీఎంకే కూటమికే చాన్స్
జనాదరణలో స్టాలిన్ తర్వాత విజయ్ ఉంటారు. ఆయనే పాపులర్ . ఈ విషయాన్ని గుర్తించి పళనిస్వామి ..విజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పొత్తులు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో బీజేపీ కూడా విజయ్ ను వ్యతిరేకించే ్వకాశం లేదు. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. అన్నాడీఎంకే తన ఉనికిని కాపాడుకోవడానికి, విజయ్ తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకోవడానికి పొత్తు ఒక అనివార్యత. కానీ, ఇద్దరు నేతలు సీఎం కుర్చీపైనే కన్నేయడంతో అది డీఎంకేకు లాభిస్తోంది.
