తమిళనాడులో సినిమా, రాజకీయం అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి. ఎంజీఆర్ కాలం నుండి జయలలిత వరకు వెండితెరపై మెరిసిన తారలే కోటపై జెండా ఎగురవేశారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించిన దళపతి విజయ్ .. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగానే ఉంటానని ప్రజలకు నమ్మకం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.తన చివరి సినిమాను జననాయగన్‌గా ప్రకటించారు. ఆయన ఉద్దేశం ఆ సినిమాను ఆదరించి తనను తమ నాయకుడిగా స్వాగతం పలకాలని కోరుకోవమే.
విజయ్‌కు లిట్మస్ టెస్ట్
సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ వస్తున్న చివరి చిత్రం జననాయగన్ జనవరి 9న విడుదల అవుతోంది. ఇది కేవలం ఓ సినిమానే కాదు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక లిట్మస్ టెస్ట్. తమిళ ఓటర్ల మనస్తత్వం ప్రకారం, వెండితెరపై హీరో ఇచ్చే సందేశాలు, ఆ సినిమా సాధించే విజయం నేరుగా వారి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతాయి. విజయ్ తన సినిమాల్లో గత కొంతకాలంగా అవినీతి, సామాజిక అన్యాయాలపై గొంతెత్తుతున్నారు. జననాయగన్ పూర్తిస్థాయి రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ కావడం, అందులో ఆయన ఒక ప్రజా నాయకుడిగా కనిపించనుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే, ఆ ఊపు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు తిరుగులేని మైలేజీని ఇస్తుంది. ఒకవేళ ఫలితం తేడా కొడితే.. ఆయనపై ప్రజలకు ఆసక్తి లేదన్న ప్రచారం ప్రారంభమవుతుంది.
ప్రజల తీర్పుకు ముందస్తు సంకేతం
రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలు తమ అభిమానాన్ని లేదా నిరసనను చూపించడానికి సినిమాలను ఒక వేదికగా చేసుకుంటారు. విజయ్ సినిమా విడుదలయ్యే థియేటర్ల వద్ద సందడి, కలెక్షన్ల వర్షం ఆయనకు ఉన్న జనాకర్షణ కు కొలమానంగా మారుతాయి. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్న తరుణంలో.. జననాయగన్ సినిమా ద్వారా విజయ్ ఇచ్చే పొలిటికల్ స్టేట్మెంట్ ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. సినిమా ఫలితమే విజయ్ రాజకీయ జాతకాన్ని రాస్తుందనడంలో సందేహం లేదు.
సినీ హీరోల రాజకీయానికి ఎన్నో సవాళ్లు
సినీ హీరోలకు జనాకర్షణ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అది రాజకీయ బలంగా మార్చుకోవడం అంత తేలిక కాదు. ఇతర భాషలకు చెందిన హీరోలు.. అలాగే కమల్ హాసన్ లాంటి హీరోలు పెట్టినపార్టీలు కూడా నిలబడలేదు. ప్రభావం చూపలేదు. అవన్నీ స్టడీ చేసి విజయ్..తన అడుగులు వేస్తున్నారు. తన సినిమా టైటిల్ నుండి కంటెంట్ వరకు అంతా ఒక పక్కా పొలిటికల్ ప్లానింగ్‌తో సిద్ధం చేశారు. సినిమా హిట్ అయితేనే జనం నాయకుడిగా ఒప్పుకున్నట్లు అనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ సినిమా ఫలితం విజయకు చాలా ముఖ్యం.
