విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వచ్చినా… ఆయన ఓ క్యారెక్టర్ చేసిన సినిమా వచ్చినా ఆసక్తి చూపించే ఆడియన్స్ ఉన్నారు. ఆయన కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటున్నారు. తెలుగు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి ఎప్పుడో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న సూర్య, అజిత్, విజయ్ కంటే బెటర్‌గా మాట్లాడగలరు. అయితే భాషలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆయన ఒక ప్రామిస్ చేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు విజయ్. ఆ సినిమా పూర్తయ్యేసరికి తెలుగు మాట్లాడటమే కాదు, కవిత్వం కూడా రాస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.
విజయ్ కుమారుడు సూర్య ఫీనిక్స్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. నవంబర్ 7న ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు విజయ్ సేతుపతి. “సూర్య సినిమా విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. డైరెక్టర్ అనల్ అరసు ‘జవాన్’ సినిమా సమయంలో ఈ కథ చెప్పారు. మా అబ్బాయి హీరోగా కావాలి అన్నారు. ‘వాడు మీరు మాట్లాడుకోండి’ అన్నాను. ఆ తర్వాత ఆ సినిమా గురించి నాకు తెలీదు. ఫైనల్ సినిమా చూశాను, నచ్చింది. తెలుగు ఆడియన్స్‌కూ నచ్చుతుందనే’ అనే ఆశాభావం వ్యక్తం చేశారు విజయ్.