తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేసిన నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం ప్రస్తుతం పూర్తిగా సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుపోయిందని తమిళ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్‌కు ఉన్న సినీ గ్లామర్‌ను అడ్డుపెట్టుకుని వేలాది మందితో కూడిన సోషల్ మీడియా సైన్యం నిరంతరం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కంటే, ఎక్స్ , ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై హ్యాష్ ట్యాగ్‌లతో కృత్రిమమైన హైప్ యేట్ చేయడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేస్తోంది. దీనివల్ల సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కనిపిస్తున్నప్పటికీ, ఓటర్ల నాడిని పట్టుకోవడంలో పార్టీ విఫలమవుతోంది.
ఊరూపేరు లేని సర్వేలతో టీవీకే సోషల్ మీడియా కార్యకర్తల హైప్
ఉనికిలో లేని లేదా గుర్తింపు లేని కొన్ని సర్వే సంస్థల నివేదికలను అడ్డం పెట్టుకుని టీవీకే తన బలాన్ని అతిగా ప్రదర్శించుకుంటోంది. విజయ్ వస్తే మార్పు ఖాయం , తదుపరి సీఎం విజయే అంటూ సోషల్ మీడియాలో వచ్చే గ్రాఫిక్స్, ఎడిటెడ్ వీడియోలను చూసి విజయ్ స్వయంగా ఈ ప్రచార మాయలో పడిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యూహ ప్రతివ్యూహాల కంటే, కేవలం లైక్‌లు, వ్యూస్ ఆధారంగానే తన రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకోవడం వల్ల ఆయన గ్రౌండ్ రియాలిటీతో టచ్ కోల్పోయినట్లుగా కనిపిస్తోంది.
గ్రామస్థాయి యంత్రాంగం ఏది?
తమిళనాడులో దశాబ్దాల కాలంగా వేళ్లూనుకున్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలకు ప్రతి గ్రామస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉంది. కానీ, విజయ్ పార్టీ ఇప్పటికీ కేవలం పట్టణ ప్రాంత యువత, అభిమాన సంఘాలకే పరిమితమైంది. గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే సంక్షేమ అజెండా గానీ, పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు గానీ టీవీకేకు ఇంకా ఏర్పాటు కాలేదు. కేవలం ఆన్లైన్ సభ్యత్వ నమోదుతోనే లక్షల సంఖ్యలో కేడర్ ఉందని భ్రమపడుతున్న విజయ్, ఎన్నికల నాటికి ఈ సోషల్ మీడియా బలం ఓట్లుగా మారుతుందా లేదా అనే విషయాన్ని విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.
తమిళ ఓటర్ల నాడిని గుర్తించలేకపోతున్న విజయ్
గతంలో నటుడు కమల్ హాసన్ కూడా ఇలాగే సోషల్ మీడియాలో భారీ హంగామా సృష్టించినప్పటికీ, ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభావం సున్నా అని తేలిపోయింది. విజయ్ కూడా అదే తప్పును పునరావృతం చేస్తున్నారని, డిజిటల్ స్క్రీన్లపై కనిపించే స్పందనకు, బ్యాలెట్ బాక్సుల్లో పడే ఓటుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ సర్వేలు, పెయిడ్ ప్రమోషన్లు పార్టీకి తాత్కాలిక సంతృప్తిని ఇవ్వవచ్చు కానీ, అవి గెలుపుకు గ్యారెంటీ ఇవ్వలేవు. అభిమాన సంఘాల నినాదాలు , సోషల్ మీడియా సైన్యం చేసే హడావుడిని చూసి గెలుపుపై ధీమాగా ఉండటం రాజకీయ ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.ఆ మాయ నుంచి విజయ్ బయటపడాల్సి ఉంది.
