తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ సేలం పర్యటనలో బహిరంగ సభ నిర్వహించుకోవడానికి స్థానిక పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు అనేక కఠిన నిబంధనలు విధించారు. ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కేవలం మూడు గంటల సమయం మాత్రమే సభకు కేటాయించారు.
భద్రతా కారణాల దృష్ట్యా సభకు హాజరయ్యే వారి సంఖ్యపై పోలీసులు పరిమితి విధించారు. ఈ సమావేశానికి కేవలం 5000 మంది పాల్గొనేందుకు మాత్రమే అనుమతి లభించింది. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ముందుగానే టోకెన్లు పంపిణీ చేయాలని, టోకెన్ ఉన్న వారిని మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పరిమితికి మించి జనం తరలివస్తే తలెత్తే ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సభకు గర్భిణీలు, చిన్నపిల్లలు అలాగే వృద్ధులు హాజరుకాకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఎండ తీవ్రతతో పాటు రద్దీ వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిబంధన విధించారు. విజయ్ రాజకీయ అరంగేట్రం తర్వాత నిర్వహిస్తున్న కీలక సభలలో ఇది ఒకటి కావడంతో, పోలీసులు ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.
విజయ్ కూడా ఇప్పుడు పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేసి.. నా ఇష్టం.. అన్నట్లుగా వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికే ఓ ప్రమాదం వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. మరోసారి అలాంటివి జరిగితే ఆయన ఇబ్బందుల్లో పడతారు. ఏపీలో కొంత మంది నేతల్లా ఆయన చట్టం తో చెలగాటం చేసే పరిస్థితి లేదు.

