ఏపీలో నెంబర్ వన్ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ అని ప్రభుత్వం తేల్చింది. మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఈ ర్యాంకింగ్స్ ను ఇచ్చింది. అభివృద్ధి , సంక్షేమ సూచికల ఆధారంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ప్రకటించిన ర్యాంకుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 93 శాతం మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా నిలిచింది.
గాజువాక , కాకినాడ సిటీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మిషన్ వెస్ట్ పేరుతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా గడప గడపకు సుజనా వంటి కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని పరుగెత్తించారు.
విద్యా, వైద్య రంగాల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడంలో ఆయన చూపిన చొరవ ఈ ర్యాంకింగ్లో కీలకమైన మార్కులను తెచ్చిపెట్టింది. రాజకీయ అనుభవాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కృష్ణా నది తీర ప్రాంత అభివృద్ధి, డివిజన్ల వారీగా పార్కుల పునరుద్ధరణ వంటి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం కాగితాల మీద ప్రణాళికలు వేయడమే కాకుండా, ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించడం వల్ల పనుల్లో నాణ్యత మరియు వేగం పెరిగాయి. అందుకే నెంబర్ వన్ గా నిలిచినట్లుగా భావిస్తున్నారు.