పరుచూరి బ్రదర్స్… తెలుగు సినిమా డైలాగ్‌కి కొత్త ఒరవడి నేర్పిన గురువులు. మూడొందలు పైచిలుకు సినిమాలకు ‘మాట’ సాయం చేశారు. తెలుగు ఇండ్రస్ట్రీ బ్లాక్‌బస్టర్స్‌లో పరుచూరి బ్రదర్స్ వాటా ఎక్కువగానే ఉంది. మూడు తరాల హీరోలతోనూ పనిచేసినవాళ్లు, అందరికీ కావాల్సినవాళ్లు. అయితే.. నవతరం జోరు పక్కన ఈ సీనియారిటీ నిలబడడం లేదు. పంచ్ డైలాగుల హంగామా ఎక్కువైంది. దర్శకులే మాటలు రాసేసుకోవడం మొదలెట్టారు. ఓ సినిమాకి పదిమంది రచయితలు పనిచేస్తున్న కాలమిది. ట్రెండ్ కూడా మారింది. దాంతో పరుచూరి సోదరులకు పని తగ్గింది. కృష్ణవంశీలాంటి వాళ్లైతే గురుతర బాధ్యతగా వాళ్లతో పనిచేయించుకొంటున్నారు. అయితే అక్కడ కూడా స్ర్కిప్టు కరక్షన్ల వరకే పరిమితం అవుతున్నారు బ్రదర్స్. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150కీ రచయితలుగా పనిచేస్తున్నారు పరుచూరి సోదరులు. టైటిల్ కార్డ్స్‌లో పరుచూరి బ్రదర్స్ అనే పేరు పడినా… అది పేరుకు మాత్రమే అని టాక్.
ఆకుల శివ, బుర్రా సాయిమాధవ్‌లు ఈసినిమాకి సంబంధించిన డైలాగ్స్ రాశారని, పరుచూరి బ్రదర్స్ కేవలం ‘రాయించుకొన్నార’ని తెలుస్తోంది. అసలే ఇది రీమేక్ స్టోరీ. సో.. కథ విషయంలో మార్పులూ చేర్పులూ ఉండవు. డైలాగులు మాత్రం ఆకుల శివ, సాయి మాధవ్‌లు చూసుకొన్నారు. అంటే చిరు సినిమాకీ ఈ బ్రదర్స్ డమ్మీనే అన్నమాట. పరుచూరి వారి చేయిపడితే… కాస్త బాగుంటుందని చిరు వాళ్లని టీమ్‌లోకి తీసుకొచ్చాడని, కానీ వినాయక్ మాత్రం బ్రదర్స్‌ని పక్కన పెట్టాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్తనీరు వస్తున్నప్పుడు పాత నీరు మరుగైపోతుంది. ఇక్కడా అదే జరుగుతోందన్నమాట.
