ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటారనే పేరుంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణమే అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అమరావతి విషయంలో కూడా ఆయన ఆవిదంగానే ఆలోచిస్తున్నారని స్పష్టం అవుతోంది. అదేదో మాటలతో చెపితే సామాన్యప్రజలకి అర్ధం కాదనుకున్నారో ఏమో అమరావతి గురించి ఆయన కంటున్న కలలని విజువలైజ్ చేసి ప్రజలకి చూపించేందుకు అమరావతి ఊహాచిత్రాలు గీయించి విడుదల చేశారు. అవి ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు. కనుకనే రాష్ట్ర ప్రజలందరూ అమరావతికి బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. అయితే నిధుల కొరత కారణంగా ఆ కలలు ఎప్పటికి నిజం చేసి చూపిస్తారో ఆయన కూడా నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మించి తన దీక్షా దక్షతలను చాటి చెప్పుకోవాలనే తపన ఆయన మాటలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయనకి ఆ అదృష్టం ఉందో లేదో కాలమే చెపుతుంది.
అమరావతితో బాటు దాని చుట్టూ విద్యా, వైద్య, క్రీడా, పరిశ్రమల కోసం ఆరు వేర్వేరు నగరాలు కూడా నిర్మించడానికి కూడా ఆయన ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు. అవి కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఈరోజు సింధూని సత్కరిస్తూ చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే విషయం మరొకసారి చెప్పారు. అమరావతి పక్కనే నిర్మించబోయే స్పోర్ట్స్ సిటీలో అన్నిరకాల క్రీడలకి శిక్షణా, నిర్వహణ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దానిలో బ్యాడ్మింటన్ కోసం కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పడమే చాలా విడ్డూరంగా ఉంది. అది కూడా ఆయన చాలా దూరదృష్టితో చెపుతున్నదే కావచ్చు కానీ అది అమరావతి నిర్మాణం పూర్తయ్యి, రాష్ట్రం ఆర్ధికంగా చాలా బలపడినప్పుడే అటువంటి పెద్దపెద్ద కలలు కనడానికి అర్హత ఉంటుంది. మెట్రోరైల్ ప్రాజెక్టు వంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికే నిధుల కోసం వెతుక్కొంటున్నప్పుడు, ఇప్పుడే ఒలింపిక్స్ గురించి ఆలోచించడం తొందరపాటే అవుతుంది. కనుక ముందుగా అమరావతి నిర్మాణం మొదలుపెట్టి, వచ్చే ఎన్నికలలోగా దానికి కొంతైనా రూపురేఖలు తీసుకురాగలిగితే అదే చాలా గొప్ప విషయం.
రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేనప్పటికీ, ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేసే అవకాశం దక్కడం చంద్రబాబు నాయుడి అదృష్టమేనని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన అమరావతి, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టు వంటి హామీలు నెరవేర్చగలిగితే ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని గుర్తుంచుకోవాలి.
