వినాయకుని వ్రతకల్పం కథ విన్న వారికి అనేక స్ఫూర్తివంతమైన జీవిత పాఠాలు గుర్తుకు వస్తాయి. ఎలాంటి అంశాన్ని , ఏ కోణంలో తమ జీవితానికి అన్వయించుకోవాలన్నది వారి దృక్పధాన్ని బట్టి ఉంటుంది. కానీ ఓ ఆలోచన ప్రారంభమవడానికి.. అది కార్యాచరణలోకి రావడానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా మానసిక బలాన్ని , నమ్మకాన్ని అందించే విషయంలో వినాయకుడు ఎప్పుడూ మన ముందే ఉంటాడు.
గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు. జ్ఞానం, శ్రేయస్సు, సౌభాగ్యాన్ని ప్రసాదించే భగవంతుడు. ఈ పండుగ సమాజంలో ఐక్యతను, భక్తిని, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తుంది. వినాయక చవితి కేవలం మతపరమైన పండుగే కాదు, సామాజిక సాంస్కృతిక ఏకత్వానికి చిహ్నం. హైదరాబాద్, ముంబై సహా చాలా ప్రాంతాల్లో ముస్లింలు కూడా ఈ పండుగను చేసుకుంటారు. సంతోషాలను పంచుకుంటారు , పూజా సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.
గణేశుని పూజ ద్వారా భక్తులు కొత్త పనులను ప్రారంభించడానికి, విఘ్నాలను అధిగమించడానికి, మ జీవితంలో విజయం సాధించడానికి ప్రేరణ పొందుతారు. అంతా దేవుడిదే భారం అని అనుకునేవారు కాకుండా తాము చేసే ప్రతి ప్రయత్నం వెనుక దేవుడు ఉన్నాడన్న నమ్మకం పెట్టుకుని చేసే ప్రతి ఒక్కరికీ గణేశుడు తన శక్తిని ఇస్తూనే ఉంటాడు. అందుకే వినాయక చవితి భక్తి, సంస్కృతి, సామాజిక బాధ్యతలను సమన్వయం చేసే ఒక అద్భుతమైన పండుగ.
వినాయకచతుర్థి శుభాకాంక్షలు