విశాఖ ఓ అందమైన నగరం. కొత్తగా విదేశాల నుంచి ఎవరు వచ్చినా.. తాము చూసిన అద్భుతమైన నగరాల్లో ఒకటిగా గుర్తు చేసుకుంటారు. అలాంటి నగరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దిగ్గజంగా నిలవడానికి ముందడుగు పడుతోంది. ఐటీ రంగానికి కేంద్రంగా చేయడానికి చంద్రబాబు , లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దాదాపుగా లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ సబ్సిడరీ రెయిడన్ నిర్మించబోయే ఏఐ హబ్ ఒప్పందం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సంస్థే పిల్లర్‌గా విశాఖ ఐటీ కేంద్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
నారా లోకేష్ ప్రయత్నాలతో విశాఖకు గూగుల్
గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు నారా లోకేష్ కష్టం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్ లో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. గూగుల్ కార్యాలయంలో ఉన్నతాధికారుల్ని కలిశారు. విశాఖ విశిష్టతుల్ని అక్కడ ఉన్న అవకాశాల్ని వివరించారు. కావాల్సినంత మ్యాన్ పవర్ అందుబాటులో ఉండటమే కాదు.. ప్రోత్సాహకాల పరంగా కూడా బెస్ట్ ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆ తర్వాత కూడా నిరంతరం సంప్రదింపులు చేశారు. చివరికి గూగుల్ ఏఐ హబ్ విశాఖకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఒప్పందం తర్వాత పనులు ప్రారంభించి..మూడేళ్లలోనే తొలి దశ పూర్తి చేయనున్నారు.
గూగుల్ ఓ అయస్కాంతం.. ఎన్ని దిగ్గజ సంస్థలు వస్తాయో చెప్పడం కష్టం !
గూగుల్ లాంటి సంస్థ వస్తోందంటే… దాన్ని ఓ భారీ పిల్లర్‌గా ఉపయోగించుకుని ఐటీ కోట కట్టేసేందుకు నారా లోకేష్, చంద్రబాబు ఎప్పుడూ సిద్ధమే. అలాంటి అవకాశాలను వదులుకుంటారా?. అందుకే ముందుగానే ప్రమోట్ చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు యాక్సెంచర్ , కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను ప్రారంభిస్తున్నాయి. ఇక టీసీఎస్ తమ డెవలప్మెంట్ సెంటర్ మాత్రమే కాదు.. గిగాబైట్ డేటా సెంటర్ కూడా పెట్టాలనుకుంటోంది. ఈ పెట్టుబడి కూడా గ్రౌండ్ అయితే.. విశాఖలో ఐటీ అభివృద్ధిని ఏ స్థాయికి వెళ్తుందో ఊహించలేం.
ఏఐ రంగాన్ని ప్రోత్సహించడమే కీలకం
హైదరాబాద్ లో మైక్రోసాప్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలు హైదరాబాద్ పై దృష్టి పెట్టాయి.ఇప్పుడు విశాఖలో గూగుల్ ఏర్పాటు తర్వాత అలాంటి వాతవరణం ఏర్పడుతుంది. మారుతున్న కాలంలో ఏఐ కీలకం. ఏఐకి డేటానే కీలకం. ఇప్పుడు విశాఖ డేటా క్యాపిటల్ గా మారుతుంది. ఇక రానున్న రోజుల్లో విశాఖ ప్రపంచ స్థాయి ఐటీ క్యాపిటల్ గా మారుతుందనడంలో సందేహం లేదు. అందుకే ఇవాళ అంటే అక్టోబర్ 14 విశాఖ చరిత్రకు సువర్ణాధ్యాయం అనుకోవచ్చు.