విశాఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. ఇండస్ట్రీ వర్గాలు, ఐటీ వర్గాలు, ప్రభుత్వాలు, రాజకీయాల నేతల మధ్య ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దేశంలో మొట్టమొదటి ఏఐ హబ్ విశాఖలో ఏర్పాటుకు ఒప్పందాలు జరగడం.. ఐదేళ్ల వ్యవధిలోనే 15 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడం గేమ్ ఛేంజర్ అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లోనూ నిపుణులు ఈ అంశంపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సూపర్ పవర్ గా ఇండియా మారే అంశంలో మొదటి అడుగు ఘనంగా పడిందని చెబుతున్నారు.
ఈ డేటా సెంటర్ పై స్వయంగా సుందర్ పిచాయ్ స్పందించారు. తాను ప్రధానితో కూడా ఈ అంశంపై మాట్లాడానన్నారు. అలాగే ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఇండియా గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతుందన్నారు. నారా లోకేష్ ఎంతో ముందు చూపుతుగా.. గత అక్టోబర్ లో గూగుల్ ఆఫీసును సందర్శించి వారి ఏఐ హబ్ ప్రణాళికలకు తగ్గట్లుగా ఏపీ వద్ద ఉన్న సౌకర్యాలు, విశాఖ సానుకూలత అంశాలను వివరించి..ఆ తర్వాత ఏడాది పాటు ఫాలో అప్ చేసి.. పెట్టుబడులను సాకారం చేశారు.
చాలా మంది ఇండస్ట్రీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు.. గూగుల్ పెట్టుబడుల వల్ల వచ్చే ఉద్యోగాలు మాత్రమే చూడాల్సిన అవసరం లేదని.. విశాఖలో ఏర్పడబోయే ఓ ఎకో సిస్టమ్‌ను చూడాల్సి ఉందన్నారు. ఈ ఎకో సిస్టమ్ వల్ల దిగ్గజ కంపెనీలు, స్టార్టప్‌లు వస్తాయని.. ప్రపంచస్థాయి కంపెనీలు.. విశాఖలో ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగితే.. ముంబైతోనే విశాఖ పోటీ పడుతుందని..దేశ ఉపాధి కేంద్రంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.