జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక రాజకీయం చేస్తోంది. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే మాగంటి సునీత తరపున మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని.. అభ్యర్థి ఆమేనని అందులో సందేహం లేదంటున్నారు. కానీ ఏ కారణంతో అయినా నామినేషన్ తిరస్కరణకు గురి అయితే విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థి అవుతారని అందుకే అలా దాఖలు చేశారని చెప్పుకొస్తున్నారు.
కానీ మాగంటి సునీతకు డమ్మీగా విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించాల్సిన అవసరం ఉండదు. అంతగా అయితే మాగంటి సునీత కుటుంబసభ్యుల్లో మరొకరితో నామినేషన్ వేయించేవాళ్లు. ప్రత్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ కు.. మాగంటి సునీత గట్టి పోటీ ఇస్తారన్న నమ్మకం లేకపోవడం వల్లనే ఇలా చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లిహిల్స్ లో మంచి క్యాడర్ ఉంది. పీజేఆర్ తనయుడిగా ఇమేజ్ కూడా ఉంది.
నవీన్ యాదవ్ ఇమేజ్ కు.. విష్ణువర్ధన్ రెడ్డి అయితే కరెక్ట్ గా సరిపోతారన్న అంచనాలు ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ చివరి క్షణంలో ట్విస్ట్ ఇచ్చి.. బీఫాం విష్ణువర్ధన్ రెడ్డి పేరుపైకి మార్చినా ఆశ్చర్యంలేదన్న వాదన ఉంది. అయితే ఇప్పటికే బీఫాంతో పాటు రూ. 40లక్షలు ప్రచార ఖర్చుల కోసం మాగంటి సునీతకు కేసీఆర్ కవర్ ఇచ్చారు. కానీ మార్చాలనుకుంటే మాత్రం మార్చడం ఆ పార్టీ చేతుల్లోనే ఉంది.