Vishnu Vinyasam Movie review
తెలుగు360 రేటింగ్ : 2.5/5
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అని ముద్దుగా పిలిపించుకొంటుంటాడు శ్రీవిష్ణు. తనకు కామెడీ కథలు అంతగా అచ్చొస్తాయి. డిఫరెంట్ టైమింగ్ తో, బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో వినోదాలు పంచడం శ్రీవిష్ణుకే చెల్లింది. ఇప్పటి ప్రేక్షకులు కూడా పెద్దగా ఏం ఆశించడం లేదు. సినిమాకెళ్తే.. కాస్త కాలక్షేపం దొరికితే చాలు అనుకొంటున్నారు. ఇప్పుడు శ్రీవిష్ణు కూడా అలాంటి కథలపైనే దృష్టి పెట్టాడు. ఆ దారిలోనే వెళ్లి తీసిన మరో కామెడీ కథ.. ‘విష్ణు విన్యాసం’. వరుస హిట్లతో దూకుడు మీదున్న విష్ణు ఈసారి ఎలాంటి నవ్వులు పంచాడు? తన ఎంటర్టైన్మెంట్ కి ఎన్ని మార్కులు పడతాయి?
విష్ణు (శ్రీవిష్ణు) ఓ కాలేజీలో లెక్చలర్‌గా పని చేస్తుంటాడు. తనకు జాతకాల పిచ్చి. వాస్తులు, నెంబర్గేమ్లను బాగా నమ్ముతాడు. ఏదైనా సరే.. ముహూర్త ప్రకారమే చేస్తాడు. తన ఇంట్లో బాత్ రూమ్ వాస్తు బాలేదని, పక్కింటి బాత్ రూమ్ ని రెంట్ కట్టి మరీ వాడుకొనేంత పిచ్చి. 5 తన లక్కీ నెంబర్ కాబట్టి.. తన బైక్ కి మరో మూడు చక్రాలు తగిలించుకొనేంత మూఢ నమ్మకం. ఏజ్ బార్ అవుతున్నా.. పెళ్లవ్వదు. తన కాలేజీలోనే కొత్తగా చేరిన మరో లెక్చలర్ మనీషా (నయనసారిక) విష్ణుని ఇష్టపడుతుంది. కానీ మనీషా మామూలు అమ్మాయి కాదు. తన అలవాట్లు, ప్రవర్తన అంతా చిత్ర విచిత్రంగా ఉంటుంది. అయినా సరే.. మనీషాని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోమంటాడు. అప్పుడే తనకు సంబంధించిన ఓ నిజాన్ని మనీషా రివీల్ చేస్తుంది. అదేమిటి? ఆ నిజం.. విష్ణుని ఎంతగా భయపెట్టింది? ఆ తరవాత ఏమైంది? అనేదే ‘విష్ణు విన్యాసం’.
హీరోకి జాతకాల పిచ్చి ఉండడం.. అందులోంచి వినోదం పుట్టడం గతంలో కొన్ని సినిమాల్లో చూశాం. రాజేంద్ర ప్రసాద్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అందుకు పరాకాష్ట. జాతకం అనే పాయింట్ ని రాజేంద్ర ప్రసాద్ – ఈవీవీ అన్ని రకాలుగానూ పిండేశారు. సెకండాఫ్‌ని నడిపించే ‘రెండు మంగళసూత్రాలు’ అనే గండం కూడా కొత్తదేం కాదు. అదే రాజేంద్ర ప్రసాద్ … అదే ఈవీవీ సత్యనారాయణ కలిసి చేసిన `అప్పుల అప్పారావు`లోనూ ఇదే పాయింట్. ఇప్పుడు ఆ రెండు అంశాల్నీ కలిపి ఈ కథ రాసుకొన్నాడు దర్శకుడు. పాయింట్ పాతది.. కాన్ఫ్లిక్ట్ మరింత పాతది అయినప్పుడు కొత్త తరహా సన్నివేశాల్ని రాసుకోగలగాలి. అక్కడ.. ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. ఎంతసేపూ.. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగుల్లోంచి కొంత కామెడీ రాబట్టే ప్రయత్నం చేస్తుంటారే తప్ప.. సన్నివేశాల్లోంచి హాస్యం పుట్టుకురాదు. పైగా సినిమా అంతా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఓ చోట మొనాటినీ వచ్చేస్తుంది. విష్ణు విన్యాసంలో అది ఇంకొంచెం తొందరగా వచ్చేసింది. హీరోయిన్‌కి ఏదో సమస్య ఉంది.. ఉంది.. అని చెప్పుకొంటూ వచ్చారు. ఆ సమస్య ఏమిటన్న ఆసక్తి ఫస్టాఫ్‌ని కాసేపు నడిపిస్తుంది. ఆ సమస్య రివీల్ అయిపోయిన తరవాత ఆ మజా కూడా ఉండదు. ఫస్టాఫ్‌లో హీరో – హీరోయిన్ ట్రాక్ కాస్త ఫన్ క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో మీమ్స్ వాడుకొని విష్ణు కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. మైత్రీ మూవీస్ – గీతా ఆర్ట్స్ అంటూ చెప్పిన ఒకట్రెండు డైలాగులు సందర్భోచితంగా కుదిరి నవ్విస్తాయి. అది మినహా.. పెద్దాగా కామెడీ వర్కవుట్ అవ్వలేదు.
సెకండాఫ్‌లో ఆ స్కోప్ కూడా లేకుండా పోయింది. హీరోయిన్ సమస్య ఏమిటో తెలిసిపోయిన తరవాత కూడా జాతకాల్ని అంతగా నమ్మే హీరో.. ఎందుకు ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అనేది అర్థం కాదు. దానికో కారణం వేసినా అది కూడా ఆర్గానిక్ గా కుదర్లేదు. హీరోని హీరోయిన్ ఎందుకు ఇష్టపడిందో చెబుతూ ఓ సీన్ వేశారు. అది మరీ క్రింజ్‌గా అనిపిస్తుంది. చివర్లో అనుకోని ఓ ట్విస్ట్. దాని వల్ల కొత్తగా ఒరిగిందేం లేదు. హీరోయిన్ పాత్రని కొత్తగా డిజైన్ చేసే ఉద్దేశంలో ఆమెతో రకరకాల విన్యాసాలు చేయించారు. వాటికి కొంత జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది అతకలేదు. హీరోయిన్ ఫ్యామిలీని నిజంగానే దండుపాళ్యం బ్యాచ్‌లా చూపించారు. ఈ సినిమాలో విష్ణు కూడా అది డైలాగ్ రూపంలో సెటైరికల్ గా చెప్పాడు కూడా.
శ్రీవిష్ణు తనకు చేతనైనంత చేశాడు. సన్నివేశాల్ని తన కామెడీ టైమింగ్ తో ఒడ్డున పడేసే ప్రయత్నం చేశాడు. కానీ తన బలం సరిపోలేదు. `ఆయ్` ఫేమ్ నయన సారిక ఓకే అనిపిస్తుంది. సత్య ని కూడా సరిగా వాడుకోలేదు. తను అక్కడక్కడ కొంత నవ్వించే ప్రయత్నం చేశాడు. మురళీ శర్మది రొటీన్ క్యారెక్టరే. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి… వీళ్లంతా పరిధిమేర నటించారు. చెప్పుకోదగ్గ క్యారెక్టర్ గానీ, క్యారెక్టరైజేషన్ కానీ కనిపించలేదు.
స్క్రిప్టుపై పెద్దగా ఫోకస్ పెట్టినట్టు కనిపించలేదు. ‘సెట్లో విష్ణు చూసుకొంటాడులే’ అనే ధీమాతో అన్ని సన్నివేశాలూ పైపైనే రాసుకొని వెళ్లినట్టు కనిపించింది. విజువల్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదు. చాలా సన్నివేశాల్లో హీరో, హీరోయిన్లు ఒకే చోట నిలబడి డైలాగులు చెప్పుకొంటూ వెళ్లిపోతుంటారు. రధన్ పాటల్లో మెరుపుల్లేవు. రీ రికార్డింగ్ కూడా అంతంత మాత్రమే. కొన్ని డైలాగులు అక్కడక్కడ పేలాయి. అది డైలాగ్ రైటర్ గొప్పతనమో, డబ్బింగ్ లో శ్రీవిష్ణు చేసిన విన్యాసమో అర్థం కాదు.
ఏది ఏమైనా.. కొన్ని సీన్ల కాలయాపన తప్ప. కథలో బలం ఉండీ, సన్నివేశాలు కొత్తగా రాసుకొన్నప్పుడు శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ వాటికి యాడ్ అవుతుంది. అప్పుడు ‘సామజవరగమన’ లాంటి సినిమాలు వస్తాయి. కానీ ఇది పూర్తిగా శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ పైనే ఆధారపడి తీసిన సినిమా అనిపిస్తుంది. అందుకే శ్రీవిష్ణు తప్ప… మరో అట్రాక్షన్ ఈ సినిమాలో లేకుండా పోయింది.
తెలుగు360 రేటింగ్ : 2.5/5
