దమ్కీ ట్రైల‌ర్‌: గెట‌వుట్ ఫ్ర‌మ్ మై కార్‌

విశ్వ‌క్‌సేన్ అంటే ఫుల్ మాస్‌. ఏదైనా…. ఇచ్చిప‌డేయాలంతే. ఈ మ‌ధ్య ఎందుకో క్లాస్ సినిమాలు చేస్తూ, బుద్ధి మంతుడిలా క‌నిపించాడు. ఇప్పుడు త‌న‌దైన రూట్లోకి వెళ్లిపోయాడు. `ద‌మ్కీ`తో. క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ…. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో.. ఫిబ్ర‌వ‌రిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైల‌ర్ 1.ఓ వ‌చ్చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా `ద‌మ్కీ` ట్రైల‌ర్ కొద్దిసేప‌టి క్రితం విడుద‌లైంది.

అదో కార్పొరేట్ సామ్రాజ్యం. వేల కోట్ల ఆస్తి… వంద‌ల మంది ఉద్యోగులు.. వీళ్ల భ‌విష్య‌త్తంతా త‌ల్ల‌కిందులు అయిపోతుంటుంది. మ‌రోవైపు.. ఓ హోటెల్‌లో వెయిట‌ర్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు హీరో. స్నేహితుల‌తో స‌ర‌దాలూ, పార్టీలూ, బిల్డ‌ప్పుల‌తో సాగిపోయే హీరో జీవితంలో స‌డ‌న్ గా ఓ ట్విస్ట్ వ‌స్తుంది. వేల కోట్ల కంపెనీని కాపాడే బాధ్య‌త త‌న‌మీద ప‌డుతుంది. అదెలా? ఏమిటి? అనేదే ద‌మ్కీ క‌థ‌. కార్పొరేట్ రాజ‌కీయాల‌తో, విశ్వ‌క్ మాస్ హీరోయిజం, ల‌వ్ స్టోరీ.. ఇవ‌న్నీ మిక్స్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. నివేదా పేతురాజ్ క‌థానాయిక‌గా న‌టించింది. వీరిద్ద‌రి కెమిస్ట్రీ బాగానే కుదిరింది. విశ్వ‌క్ సినిమాల్లో బూతులు అల‌వోక‌గా వ‌చ్చేస్తుంటాయి. ఇందులోనూ దానికి కొద‌వ లేదు. బీప్ లు ప‌డే డైలాగులు కొన్ని ఉన్నాయి. అయితే… క్లైమాక్స్ డైలాగే సూప‌ర్‌. ఇటీవ‌ల విశ్వ‌క్ ఓ టీవీ ఛాన‌ల్ డిబేట్ కి వెళ్తే.. `గెట‌వుట్ ఫ్ర‌మ్ మై స్టూడియో` అంటూ ఓ యాంక‌ర్ వేలు చూపించింది. స‌రిగ్గా.. అదే సీన్‌… ఓ కార్లో వాడేశాడు విశ్వ‌క్‌. `గెటవుట్ ఫ్ర‌మ్ మై కార్‌` అంటూ… హీరోయిన్ తో అనిపించుకొన్నాడు. టీవీ వాళ్లు, ఆ యాంక‌రు, ఆఖ‌రికి జ‌నాలు కూడా మ‌ర్చిపోయిన విష‌యాన్ని విశ్వ‌క్ ఇంకా గుండెల్లోనే పెట్టుకొన్నాడ‌న్న సంగ‌తి దీంతో అర్థ‌మైపోయింది. మొత్తానికి ఓ మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా రాబోతోంద‌న్న హింట్ మాత్రం ట్రైల‌ర్ ఇచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.