ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. రాజధాని ప్రభావంతో విజయవాడలోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. రాయలసీమలో తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ, విజయవాడ ఉద్యోగ, ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి.
లింక్డ్ఇన్ విడుదల చేసిన “Cities on the Rise 2025” నివేదిక ప్రకారం, విశాఖపట్నం , విజయవాడ భారతదేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-మెట్రో ఉద్యోగ కేంద్రాలలో టాప్ త్రీలో ఉన్నాయి. విశాఖపట్నం ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, విద్య, లాజిస్టిక్స్, మెటల్ మినరల్స్ వంటి రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడం, తక్కువ జీవన ఖర్చు, ఈ నగరాన్ని ఉద్యోగ కేంద్రంగా మారుస్తున్నాయి.
విజయవాడలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగాలు ప్రధానంగా పెరుగుతున్నాయి. HCLTech, ఇన్ఫోసిస్ వంటి ఐటీ సంస్థలు విజయవాడలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అమరాతి ప్రభావంతో విజయవాడలో వివిద రకాల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. లింక్డ్ఇన్ నివేదికలో విశాఖపట్నం, రాంచీ, విజయవాడ, నాసిక్, రాయ్పూర్, రాజ్కోట్, ఆగ్రా, మదురై, వడోదర, జోధ్పూర్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.