వృద్ధ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు నిత్యనూతనంగా ఎలా ఉంటాయని.. అలా ఉంటే ఆశ్చర్య పోవాల్సిందేనని పదే పదే నిరూపిస్తూ ఉంటారు. బీహార్ ఎన్నికల కోసం అక్కడ ఆ పార్టీ అత్యున్నత సమావేశం నిర్వహించింది. అందులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తే..ప్రజాస్వామ్యానికే ముప్పుఅని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని వారే చెబుతారు.. పక్కాగా సవరించేందుకు ప్రయత్నిస్తామంటే.. అది ముప్పు అంటున్నారు. అసలు కాంగ్రెస్ కే క్లారిటీ లేకపోతే.. ఎవరికి ముప్పు వస్తుంది ?
ఓటర్ల జాబితాలోని లోపాలను.. ఓట్ల చోరీగా కాంగ్రెస్ ఉద్యమం
రాహుల్ గాంధీ ఇప్పటివరకూ రెండు ప్రెస్మీట్లు పెట్టి.. ఓట్ల చోరీపై ఆరోపణలు చేశారు. ఆయన ప్రకటించిన వాటికి.. బయట పెట్టిన ఆధారాలకు పెద్దగా స్పందన రాలేదు. ఎందుకంటే అవన్నీ ఓటర్ల జాబితాలో అవకతవకలు. అవి ఎలా జరుగుతాయో అందరికీ క్లారిటీ ఉంది. పై స్థాయిలో జోక్యం చేసుకుని ఓట్లను తొలగించడం అనేది ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఓటర్ల జాబితా రిలీజ్ అయినప్పుడు మనం ఎందుకు పట్టించుకోలేదని రాహుల్ వంటి వారిని అడిగారు కూడా. అలాంటి వారి పదవుల్ని ఊడగొట్టారు కానీ.. అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు.
బీహార్ ఓట్ల జాబితా సవరణ లోపాలను ఎందుకు బయట పెట్టలేదు?
బీహార్‌లో ఓట్ల సవరణ జాబితాను ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా తొలగించిన ప్రతి ఓటు వివరాలు.. ఎందుకు తొలగించారో ఆ కారణం సహా మొత్తం ప్రచురించారు. ఓట్ల చోరీని అక్కడ నిరూపించాల్సి ఉంది. తప్పుడు పద్దతిలో ఓట్లు తీసేసి ఉంటే బయట పెట్టి ఉంటే.. కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ ఉందని అనుకుంటారు. కానీ అక్కడ ఆ ప్రక్రియలో ఏమీ బయట పెట్టకుండా.. ఇప్పుడు దేశమంతా చేస్తే.. ముప్పేనని సీడబ్ల్యూసీ లాంటి సమావేశాల్లో చర్చించుకోవడం జాతీయ వృద్ధ పార్టీ ఆలోచనలు.. అంతే వృద్ధ స్థాయిలో ఉన్నాయని అనుకోవాల్సిన పరిస్థితికి కారణం అవుతున్నాయి.
ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గించలేరు !
ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గించి.. జెన్ Z యువత తిరుగుబాటు చేస్తే..తాము పగ్గాలు చేపట్టాలని రాహుల్ గాంధీ ఆశపడుతున్నారు. అందుకే ఆయన ఎన్నికల వ్యవస్థపై దాడి చేస్తున్నారు . పోల్ బాడీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఆయన కుట్రకు కాంగ్రెస్ నేతలు వంత పాడుతున్నారు. కానీ ప్రజల్లో మాత్రం.. ప్రజాస్వామ్యం.. ఎన్నికలు జరిగే ప్రక్రియపై నమ్మకం పెరుగుతోంది. రాహుల్ గాంధీ చేస్తున్న విచిత్ర ఆరోపణలు కూడా… నమ్మకం పెరగడానికి కారణం అవుతున్నాయి. దేశమంతా ఓటర్ల జాబితాలను సంస్కరిస్తే కాంగ్రెస్‌కే ముప్పు ఏర్పడవచ్చు. అందుకే వారు కంగారు పడుతున్నారని జనం అనుకునే పరిస్థితి వచ్చింది.