కాంగ్రెస్ ప్రధాని పి. వి, బిజెపి వాజ్ పేయిని నాయకుడిగా పంపిన వేళ..

రాజకీయవేత్తలు రెండు రకాలు- రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు. అటల్ బిహారీ వాజపేయి ఈ రెండవ కోవకి చెందిన రాజకీయవేత్త. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆయన రాజనీతిజ్ఞత గతంలో ప్రపంచానికి ప్రస్ఫుటమైన సందర్భాలు ఎన్నో. వాటిలో మచ్చుతునక ఒకటి ఇది. పీవీ నరసింహారావు భారత దేశానికి ప్రధానిగా ఉన్న రోజులు అవి. ఐక్యరాజ్య సమితికి, భారతదేశం నుంచి కాశ్మీర్ సమస్య విషయమై ఒక బృందాన్ని పంపవలసి వచ్చినపుడు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజపేయి ని ఆ బృందానికి నాయకుడిగా పంపి అంతర్జాతీయ వేదికల మీద భారతదేశ వాణి ని గట్టిగా వినిపించి పాకిస్తాన్ ని ఖంగు తినిపించిన సంఘటన అది.

బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో కాశ్మీర్ విషయంలో ఒక తీర్మానాన్ని చేసి, స్వతంత్ర కాశ్మీర్ కోసం పోరాడుతున్న వేర్పాటువాదులకు అధికారికంగా పాకిస్థాన్ తరపున మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ కూడా కాశ్మీర్ సమస్యను పెద్దదిగా చేసి, అమెరికా సహా, అనేక దేశాల మద్దతు కూడగట్టారు. మెల్లిగా ఇస్లామిక్ దేశాలు కూడా “మిషన్ కాశ్మీర్” కు మద్దతు ప్రకటించసాగాయి. ఇక 1994లో, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ముందు, కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడంతో భారతదేశం అప్రమత్తమైంది. ఆ సమయంలో ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి కానీ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఏమాత్రం ఏమరుపాటుగా ప్రవర్తించి ఉన్నా, పాశ్చాత్య దేశాల ఆంక్షలు , ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో పాటు, భారతదేశం మరెన్నో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. 1990లలో అలాంటి పరిణామాలు గనుక ఎదురై ఉంటే ఇవాళ భారతదేశం ఎంతగానో నష్టపోయి ఉండేది. ఆ నష్టాలు పూడ్చుకోవడానికి కొన్ని దశాబ్దాలు కూడా సరిపోయేది కాదు. బహుశా ఐటీ రంగంలో ఇవాళ ఉన్న ప్రగతి కూడా ఉండి ఉండేది కాదని చెప్పడం అతిశయోక్తి కాదు.

కానీ అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ను ఎండగట్టడానికి ప్రధాని పి. వి. నరసింహారావు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖుర్షీద్, ఫరూక్ అబ్దుల్లా, హమీద్ అన్సారి, మన్మోహన్ సింగ్ తదితరులతో ఏర్పాటుచేసిన ఆ బృందాన్ని నడిపించవలసిందిగా, ఆ బృందానికి నాయకత్వం వహించవలసిందిగా ప్రతిపక్ష నాయకుడైన వాజపేయి ని కోరారు ప్రధాని పి. వి. నరసింహారావు. వాజపేయి నాయకత్వంలోని బృందం ఎత్తులు పై ఎత్తులతో వేర్వేరు దేశాల మద్దతు కూడగట్టడమే కాకుండా అంతర్జాతీయ యవనికపై భారత దేశ వాదనను గట్టిగా వినిపించారు. భారత్ బృందం, ఒక్కొక్క దేశాన్ని ఒప్పించడానికి ఒక్కో వ్యూహాన్ని అమలు చేసింది. రాజకీయ చదరంగాన్ని తలపించిన దౌత్య యుద్ధంలో భారత్ ఘనవిజయాన్ని సాధించింది. పాకిస్తాన్ కి మద్దతిస్తున్నఇండోనేషియా, లిబియా, సిరియా లాంటి దేశాలన్నీ ఆఖరు నిమిషంలో వెనక్కి తగ్గడంతో పాకిస్తాన్ ఖంగుతింది. ఇక ఎంతగానో నమ్మకాలు పెట్టుకున్న చైనా, ఇరాన్ కూడా చేతులెత్తేయడంతో పాకిస్థాన్ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది. అంటే, కాశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ప్రపంచానికి చాటి చెప్పడానికి పెట్టిన ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని తనకి తానే స్వయంగా వెనక్కి తీసుకోవడం తో ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది.

వాజపేయి నాయకత్వంలో ఈ బృందం సాధించిన అసాధారణ విజయం ఆరోజుల్లో భారతీయులందరినీ, ఆనందోత్సాహాలలో ముంచివేసింది. జెనీవా నుంచి ఈ బృందం భారతదేశం చేసుకునేటప్పుడు, వారికి లభించిన ఘన స్వాగతం ముందు ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ లేదా ఒలంపిక్స్ లో విజయం సాధించిన ఫుట్బాల్ టీమ్ లకి లభించే స్వాగతం కూడా దిగదుడుపే. ఆ స్థాయిలో స్వాగతం లభించింది. అయితే ఈ విజయం ఏ ఒక్కరిదో కాదు. ఆ బృందంలో పని చేసిన ప్రతి ఒక్కరిది, వారికి నాయకత్వం వహించిన వాజ్ పాయ్ ది, అలాంటి బృందాన్ని ఎంపికచేసిన పీవీ నరసింహారావు ది. ఇక కాంగ్రెస్-బిజెపి అంటూ పార్టీలను పట్టించుకోకుండా పార్టీలకతీతంగా పి. వి. నరసింహారావు, వాజ్ పాయ్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం, తనకిచ్చిన బాధ్యతలు వాజ్ పాయ్ విజయవంతంగా నిర్వహించడం, ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఏనాడూ ఆ విజయాన్ని తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాజ్ పాయ్ వినియోగించుకోకపోవడం – ఇవన్నీ ఆ సమయం లో ఆ నాయకులందరూ ఎంత బాధ్యతగా వ్యవహరించారనే దానికి నిదర్శనాలు. వీటన్నింటికీ తోడు, యావత్ భారత దేశంలో ఏ ఒక్కరూ కూడా, ఎందుకని ప్రధాని పీవీ నరసింహారావు ఈ బాధ్యతను ప్రత్యర్థి పార్టీకి చెందిన వాజ్ పాయ్ కి అప్పగించాడని సందేహించకపోవడం, వాజపేయి మీద అప్పటికే భారతదేశానికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.

మొత్తానికి, అటల్ బిహారీ వాజ్ పాయ్, పి. వి. నరసింహారావు, ఇద్దరూ రాజనీతిజ్ఞులే అని నిరూపించిన సంఘటన అది. భారత దేశ భవిష్యత్తు కోసం, భావితరాల కోసం, రాజకీయాలకతీతంగా వాజ్ పాయ్ లాంటి నాయకులు ఏవిధంగా వ్యవహరించేవారో తెలియజేసిన ఆ సంఘటన నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

-జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com