నిజంగానే దేశం భ్రష్టుపట్టిందా?

ఏకభావజాలమున్న మేధావులు ఈమధ్య చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే, నిజంగానే దేశం భ్రష్టుపట్టిందేమో.. ? అన్న అనుమానం రాకమానదు. పైగా కేంద్ర ప్రభుత్వంపై అత్యంత ఘాటుగా విమర్శనాస్త్రాలు సదరు మేధావులు సంధిస్తున్నప్పటికీ, ప్రధానమంత్రి మోదీ సరిగా స్పందిచకపోవడం ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బిజేపీ, ఆ పార్టీకి కాపుకాస్తున్న ఆర్ఎస్ఎస్ కళ్లుతెరిచినట్లున్నాయి.

మోదీ ప్రభుత్వంపై మేధావులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పటికీ వారికి సరైన రీతిలో సమాధానం చెప్పకపోతే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయన్న భయం బిజేపీ, ఆర్ఎస్ఎస్ కు పట్టుకున్నట్లుంది. మేధావివర్గం నిర్ణయాలు, అభిప్రాయాలపై మీడియా అధికమోతాదులో ప్రచారం ఇస్తుండటం కూడా వీటికి నచ్చలేదు. ఇప్పటికైనా తాము కళ్లుతెరవకపోతే నిజంగానే దేశం భ్రష్టుపట్టిందన్న భావన ప్రజల్లో పెరిగిపోతుందేమోనని బిజేపీ, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మీడియా ద్వారా కౌంటర్ ఎటాక్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి.

భావసారూప్యమున్న మేధావివర్గం (250మంది) ఒక సంయుక్త ప్రకటనలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భ్రష్టుపట్టిందని తేల్చిచెప్పడంతో కేంద్రం ఉలిక్కిపడింది. మేధావుల్లో కొంతమంది గతంలో అందుకున్న ప్రభుత్వ పురస్కారాలను తిరిగిఇచ్చేయడానికి వరుసకట్టడంతో ఈ అంశం దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని దాద్రీలో ఒక వ్యక్తిపై దాడిజరిగిన సంఘటన అనంతరం మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి పవనాలు చురుగ్గా వీచడం మొదలైంది. ఇటీవల చోటుచేసుకున్న ఏ ఒక్క అమానుష సంఘటనకు మోదీ సరైన రీతిలోస్పందించకపోవడంపట్ల మేధావులు మండిపడుతున్నారు. కంటినీటి మాటలు కాకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దేశంలో మతసామరస్యాన్ని కాపాడాలన్నది వీరి డిమాండ్. ఆ పరిస్థితి లేనందుకే తామీ నిరసన బాట తొక్కామన్నది వారి సమర్దింపు.

బీజేపి వివరణ

మేధావుల్లో ఒక వర్గం వారే తరచూ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారనీ, వారి వాదనలో పసలేదని అధికార పార్టీ బీజేపి అంటోంది. కాంగ్రెస్, వామపక్షాలు కలసికట్టుగా తమ పార్టీమీద, మోదీమీద విమర్శలు గుప్పిస్తున్నాయనీ, ఉద్దేశపూర్వకంగా సమాజంలో అసహనం రెచ్చగొడుతున్నాయని కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించేవారి మాటలను అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరంలేదనీ, మోదీ ఒకవైపు భారతదేశాన్ని ప్రగతివైపు నడిపిస్తుంటే, బీజేపీ ఆలోచనలను సరిగా అర్థంచేసుకోలేనివారు వక్రభాష్యాలు చెబుతున్నారని అరుణ్ జైట్లీ అభిప్రాయపడుతున్నారు. దేశం భ్రష్టు పట్టిందని చెప్పాలన్న ఏకైక లక్ష్యంతోనే వారు చిన్నచిన్న సంఘటనలుసైతం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి దాద్రీ సంఘటన కూడా ఇలాంటిదేనన్నది బీజేపి భావన. ఎవరెంతగా రెచ్చగొట్టినా దేశంలోని స్వేచ్ఛా సమాజంలోని సహనం చెక్కుచెదరకుండా ఉన్నదనీ, తామెప్పుడూ హింసను ప్రోత్సహించలేదని ఈ పార్టీ బల్లగుద్దీమరీ చెబుతోంది.

ఆర్ఎస్ఎస్ వాదన

మరోవైపున ఆర్ఎస్ఎస్ కూడా మేధావులు నిరసన వ్యాఖ్యలను తిప్పికొడుతోంది. మేధావులు గతంలో తీసుకున్న అవార్డులను తిరిగిఇచ్చేయడం కేవలం రాజకీయ ప్రేరణతో కూడిన నిరసనగా ఆర్ఎస్ఎస్ అభివర్ణిస్తోంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆర్ఎస్ఎస్ దే తప్పంటూ మాటలతో దాడికి దిగడం కొంతమంది మేధావులకు అలవాటుగా మారిపోయిందన్నదే ఆర్ఎస్ఎస్ కచ్చితాభిప్రాయం. కుహనా సెక్యులర్, అసహనవాదులు చిటికీమాటికీ ఆర్ఎస్ఎస్ పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హోజ్బలె అంటున్నారు.

అవార్డులను తిరిగిఇచ్చేస్తూ, తమ నిరసన వ్యక్తం చేస్తున్న రచయితలు, సినీ ప్రముఖులు, శాస్త్రవేత్తలకు ఆనాడు గోద్రా రైలు దగ్ధం సంఘటనప్పుడుకానీ, లేదా కాశ్మీరు పండితులపై దాడులు జరిగినప్పుడుగానీ గుర్తుకురాలేదా? మరి అప్పుడు ఎందుకు వారు నిరసన గళం విప్పలేదని ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తోంది. కేవలం ఈ నరస తంతంతా రాజకీయడ్రామా అని కొట్టిపారేస్తోంది.

కేంద్రంలో బిజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన వచ్చినప్పటినుంచీ మతపరంగా అసహన వాతావరణం సృష్టించడానికి రాజకీయ కుట్ర జరుగుతోంది. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. నిజాన్ని దాచిపెట్టి అబద్దాలతో మతసామరస్యవాతావరణాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారన్నది ఆర్ఎస్ఎస్ వాదన.

దేశంలో వస్తున్న పెనుమార్పులను కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీ ప్రధాని అయ్యాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజల జీవనశైలి మెరుగుపడింది. జాతీయతాభావం పెంపొందింది. ఇండియా అంటే ప్రపంచదేశాల్లో గౌరవం పెరిగింది. అభివృద్ధికి బాటలు పడ్డాయి. అయితే ఈ మార్పులను గుర్తించినట్లయితే, వారి `భావజాల దుకాణాలు’ ఎక్కడ మూతపడతాయోనని భయపడుతున్నారు. అందుకే వారంతా అసహనంగాఉన్నారు. దీంతో ఎలాగైనా తమ అస్థిత్వం కాపాడుకోవడంకోసం, వార్తల్లోకి ఎక్కడం కోసం తెగ తపనపడుతున్నారు. ఇలా చేయకపోతే తమను ప్రజలు మరచిపోతారని భయపడుతున్నారు. ఇలాంటి ఆలోచనలతోనే కొంతమంది మేధావులు వక్రభాష్యాలు చెబుతున్నారు. రాజకీయ శక్తులు తోడుకావడంతో శాంతియుత వాతావరణాన్ని ఒక ఉద్యమంలా చెడగొడుతున్నారన్నది ఆర్ఎస్ఎస్ అభిప్రాయం.

అక్కడక్కడా అసహనం ,అశాంతి చెలరేగడం 60ఏళ్ల నుంచీ ఈ ప్రజాస్వామిక దేశంలో ఉన్నప్పటికీ సదరు మేధావులు మాత్రం ఇప్పుడే కళ్లుతెరిచారు. కాశ్మీరు లోయలో వందలాది మంది కాశ్మీరీ పండితులను చంపేసినా, కరసేవకులను నిలువునా కాల్చినా పట్టించుకోని వీళ్లు ఇప్పుడు స్వల్ప సంఘటనలపై విరుచుకుపడటాన్ని ఆర్ఎస్ఎస్ తప్పుబడుతోంది. బీజేపీ పాలన లేని రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, కర్నాటక) జరిగిన సంఘటనలను నరేంద్రమోదీ చేసిన తప్పులుగా చిత్రీకరించడం చూస్తుంటే ఇది కేవలం రాజకీయ కుట్రనేనని తేలిపోతుందని ఆర్ఎస్ఎస్ అంటోంది. దాద్రి సంఘటనల్లాంటివి జరగడం శోచనీయమేనని, ఇలాంటివి ఎక్కడ జరిగినా ఖండించాల్సిందేననీ, కాకపోతే మేధావుల తిరుగుబాటు ధోరణి మాత్రం కేవలం రాజకీయ కుట్రగా సాగుతోందని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. జాతీయతాభావం, మతసామరస్యం, సంఘీభావం వంటివి పెంపొందించడానికి ఉపయోగపడాల్సిన మేధావులు అందుకు భిన్నంగా ఏదోఒక భావజాలం ఊబిలో కూరుకుపోయి రాజకీయ వర్గాలతో చేతులుకలిపి తమలోని మేధావితనాన్ని డొల్ల చేసుకోవడం విచిత్రమైన ధోరణినని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. భ్రష్టుపడుతున్నది దేశం కాదనీ, ఈ మేధావులేనన్నది ఇటు ఆర్ఎస్ఎస్, అటు బీజేపీల భావన. మరి దీనికి మేధావి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com