స్విస్ చాలెంజ్ కి మొగ్గినప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ రుణం ఎందుకో?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి ఒక బిలియన్ డాలర్లు రుణంగా తీసుకొనేందుకు అనుమతించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితం కేంద్రాన్ని కోరితే అందుకు అంగీకరించి, ప్రపంచ బ్యాంక్ కి సిఫార్సు చేస్తూ ఒక లేఖ కూడా వ్రాసింది. కానీ దానిని సగానికి అంటే 500 మిలియన్ డాలర్లకి తగ్గించవలసిందిగా కోరుతూ కేంద్ర ఆర్ధిక శాఖ అధ్వర్యంలో పనిచేసే వాణిజ్య వ్యవహారాల శాఖ ప్రపంచ బ్యాంక్ కి కొన్ని రోజుల క్రితమే ఒక లేఖ వ్రాసింది. ఆ అప్పు మొత్తాన్ని సగానికి తగ్గించినా అది సుమారు రూ.3,500 కోట్లు అవుతుంది. అంటే అది కూడా చాలా బారీ మొత్తమేనని స్పష్టం అవుతోంది. ఇదికాక కేంద్రప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం సుమారు రూ.5,000 కోట్లు వరకు ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజం కాకున్నా చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే వాయిదాలలో అంత మొత్తం చెల్లించడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించవచ్చు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో నిర్మించాలని భావిస్తున్నప్పుడు, ఒక పక్క కేంద్రప్రభుత్వం నుంచి మరోపక్క ప్రపంచ బ్యాంక్ నుంచి ఇన్ని నిధులు సమీకరించవలసిన అవసరం ఏమిటి? అనే సామాన్యుల సందేహానికి రాష్ట్ర ప్రభుత్వమే సంతృప్తికరమైన సమాధానం చెప్పవలసి ఉంది. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మించబోయే సంస్థ పెట్టబోయే పెట్టుబడికి బదులుగా రాజధానిలో ప్రధానమైన ప్రాంతంలో కోట్లు విలువచేసే భూములని ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. విలువైన భూములు ఇస్తున్నప్పుడు మళ్ళీ రాజధాని కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవలసిన అవసరం ఏమిటి? మాష్టర్ డెవలపర్ గా ఎంపికైన సింగపూర్ సంస్థ రాజధానిలో భవనాలపై కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చోట్ల నుంచి సేకరించబోయే సుమారు రూ.8,500 కోట్లు ఖర్చు చేయవలసిన అవసరం ఏమిటి? అంత బారీ మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ, చిత్రవిచిత్రమైన షరతులు పెడుతున్న విదేశీ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అనడం దేనికి? అనే సందేహాలు కలగడం సహజం.

కేంద్రప్రభుత్వం సిఫార్సు మేరకు ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.3,500 కోట్లు ఇవ్వడానికి సిద్దంగానే ఉందని తెలుస్తోంది. కానీ రాజధాని నిర్మాణంపై ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతున్నందున నిధులు విడుదల చేయడానికి వెనుకాడుతున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి రాజధానికి గ్రీన్ సిగ్నల్ సంపాదించుకొనే అవకాశాలే ఎక్కువున్నాయి కనుక ప్రపంచ బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.3,500 కోట్లు అప్పుమంజూరు కావడం కూడా ఖాయమేనని భావించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మించాలని భావిస్తున్నప్పుడు మళ్ళీ అప్పులు ఎందుకు చేస్తోంది? అది రాష్ట్ర ప్రజల సమ్మతం లేకుండా వారిపై ఆ భారం మోపడమే కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com