విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు. ఆయన బహిరంగంగా కూడా కనిపించడం లేదు. కనీసం తాను రాజకీయాల్ని వదిలేసి వ్యవసాయం చేస్తున్నానని కూడా అప్ డేట్ ఇవ్వడం లేదు. గతంలో లిక్కర్ స్కాంలో ఆయనను ప్రశ్నించడానికి సిఐడీ సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన వస్తానని చెప్పారు కానీ తర్వాత రాలేదు. తనకు కుదిరినప్పుడు వస్తానని సమాచారం ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఆయనకు ఇంకా కుదర్లేదు. సిట్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేసింది. అసలు విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు?
వీలైనంతగా ఆజ్ఞాతం పాటిస్తున్న విజయసాయిరెడ్డి
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎగిరెగిరిపడేవారు. ఆ ఎగుళ్లకు లెక్కలు వేస్తే పది అంతస్తులు ఉంటుందని అనుకోవచ్చు. ఆయన ట్విట్టర్ అంతా బూతులతో నిండిపోయేది. చంద్రబాబు, లోకేష్ ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టేవారు. ఇక ఏబీఎన్ ఆర్కేను, రామోజీరావునూ వదిలిపెట్టేవారు కాదు. ఆయన ట్వీట్లు, మాటలు చూసి.. చదువుకున్న సంస్కారం లేని వ్యక్తి అని అందరూ అనుకునేవారు. కానీ జగన్ రెడ్డిని మెప్పించడానికి.. వారిని తిట్టకపోతే తనను కోవర్టు అని అనుకునే జగన్ రెడ్డికి భయపడి అలా తిట్టేవారు. ఎంత చేసినా ఆయనను జగన్ రెడ్డి కోవర్టు అనే అనుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి .. సైలెంట్ గా ఉంటున్నారు. లిక్కర్ స్కామ్ లో కీలక విషయాలు ఆయనే బయట పెట్టారన్న ప్రచారం ఉంది.
జగన్ భయంతోనే గుట్టుగా బతుకుతున్నారా ?
లిక్కర్ స్కాంతో పాటు చాలా కీలక విషయాలు టీడీపీ క్యాంప్‌నకు ఆయన చెప్పారన్న అనుమానాలు జగన్ రెడ్డిలో ఉన్నాయని గతంలో ప్రెస్మీట్లలో విజయసాయిరెడ్డి గురించి జగన్ చేసిన కామెంట్లే నిరూపించాయి. అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు తాను జాగ్రత్తగా ఉండాలని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారని .. అందుకే ఆజ్ఞాతంలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. సీఐడీకి కూడా లిక్కర్ స్కామ్ గురించి గుట్టుగా సమాచారం ఇచ్చేశారని.. తన భద్రత కోసమే ఆయన ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియకుండా గడుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో.. కేంద్ర ప్రభుత్వాన్ని పొగడటానికి.. సంబంధం లేని అంశాలను ట్వీట్లు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
అనేక కేసులు ఆయనపై పెట్టే అవకాశం ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం
మరో వైపు ఏపీ ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు నమోదు చేయడానికి అవకాశాలు ఉన్నా పట్టించుకోవడం లేదు. జగన్ కు సంబంధించిన కీలక సమాచారం ఇస్తున్నారనో.. మరో కారణమో కానీ ఆయనపై దృష్టి పెట్టలేదు. విశాఖ బీచ్ లో ఆయన చేసిన ఘోరమైన కబ్జాకు అరెస్టు చేయాల్సి ఉంది. కానీ కోర్టు కన్నెర్ర చేసినా ఆయన వద్ద నుంచి జరిమానాలను మాత్రమే వసూలు చేశారు. విశాఖలో టీడీపీ నేతలపై ప్రతీ వీకెండ్ లో ఆయన చేసిన అరాచకాలకు చాలా శిక్షలు వేయాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయన.. సేఫ్ గా ఉన్నారు. మరి కూటమి నేతలు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటారో !
