బిగిల్ పేరుతో సినిమా తీసిన విజయ్‌కు బిగిల్ గుర్తు రాజకీయాల్లో లభించింది. తమిళంలో బిగిల్ అంటే.. విజిల్ అని అర్థం. విజిల్ గుర్తు కోసం విజయ్ ప్రత్యేకంగా పట్టుబట్టకపోయినా.. ఎన్నికల సంఘం ఇచ్చిన పది ఆప్షన్లలో అది అత్యుత్తమంగా ఉండటంతో ఎంపిక చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ నిలబడిన చోటల్లా.. విజిల్ గుర్తునే కేటాయిస్తారు.
విజయ్ గతంలో నటించిన బిగిల్ సినిమాకు, ఇప్పుడు లభించిన గుర్తుకు మధ్య ఉన్న సంబంధం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఆ సినిమాలో విజయ్ పాత్ర పేరు కూడా బిగిల్ కావడం, సినిమా అంతటా విజిల్ ఒక ముఖ్యమైన అంశంగా ఉండటంతో ఈ గుర్తు ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. విజిల్ పోడు అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో, ఎన్నికల ప్రచారంలో ఈ పాటనే థీమ్ సాంగ్‌గా వాడే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న పార్టీలకు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం సవాలుతో కూడుకున్న పని. అయితే విజయ్ తన సినిమా ఇమేజ్ ద్వారా ఇప్పటికే విజిల్ ను ఒక పాపులర్ బ్రాండ్‌గా మార్చేశారు. ఈ గుర్తు పక్కాగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉండటంతో, రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం గట్టిగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీవీకే కార్యకర్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో విజిల్ పోడు హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
