మొయినాబాద్ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితులు ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ తీవ్రమైన అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటి వరకూ స్పందించలేదు.
మొయినాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్టిలో బీజేపీ వైఖరిని నేరుగా ప్రశ్నించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తాము పోరాడుతుంటే, జాతీయ స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ గురించి మాట్లాడే బీజేపీ నేతలు ఇక్కడ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సాధారణంగా శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి కీలక నేతలు ఈ కేసుపై స్పందించకపోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ బురద జల్లే రాజకీయాల్లో తాము దూరంగా ఉండాలని అనుకుంటున్నారా.. తెరవెనుక ఇంకేమైనా రాజకీయం ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరగడం అనేది అత్యంత తీవ్రమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీజేపీ, ఈ అంశాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఆయుధంగా వాడుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే ఈ కీలక కేసులో బీజేపీ నోరు విప్పడం లేదని విమర్శిస్తున్నారు. అసలు గుట్టేమిటో బీజేపీ నేతలకే తెలియాలి.


