జంపింగ్ జపాంగ్స్ విషయంలో చాలా వరకూ మన కోర్టులన్నీ కూడా స్పీకర్‌కే ఫుల్ రైట్స్ ఉన్నాయన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాయి. అయితే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మాత్రం అలాంటి నాయకులకు చెక్ పెట్టేలాంటి తీర్పు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి తెలంగాణాలో ఇంకో పార్టీ లేకుండా చేయాలని పంతం పట్టుకు కూర్చున్నాడు కెసీఆర్. విమర్శించిన వాళ్ళందరినీ కూడా ప్రతి విమర్శలతో ఎదుర్కుంటూ గతంలో ఎన్నడూ…ఏ నాయకుడు చేయనంత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మించిపోయాడు. కెసీఆర్ అనైతిక చర్యలపైన ఎప్పటి నుంచో పోరాడుతున్న తెలంగాణా టిడిపి నాయకుడు రేవంత్‌రెడ్డి… ఎట్టకేలకు ఒక చిన్న విజయాన్ని సాధించాడు. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయం పక్కన పెడితే ఇప్పటికైతే మాత్రం టిడిపికి హైకోర్ట్ తీర్పు నైతిక బలాన్ని ఇచ్చింది. రేవంత్‌రెడ్డితో సహా టిడిపి నాయకులందరూ కూడా హైకోర్ట్ తీర్పు పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలంగాణా రాష్ట్ర టిడిపి శాఖ సాధించిన విజయం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు మాత్రం అస్సలు స్పందించడం లేదు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే చంద్రబాబు చేసిన ఓ గొప్ప రాజకీయ కార్యక్రమం టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించేయడమే. పనిలో పనిగా నేనే జాతీయ అధ్యక్షుడిని అని కూడా చెప్పేసుకున్నారు. మరి ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర శాఖ సాధించిన విజయం గురించి మాట్లాడాలి కదా?
ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడినా అది ఆంధ్రప్రదేశ్ టిడిపి రాష్ట్ర శాఖను తిట్టినట్టుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తనను తాను తిట్టుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ‘వ్యూహాత్మక మౌనం పాటించడమో లేక పవన్ చెప్పినట్టుగా ధ్యాన ముద్రలోకి వెళ్ళడమో చేసినట్టున్నాడు. అయితే హైకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్‌లో తన మెడకు చుట్టుకుంటుందన్న అనుమానం వస్తే మాత్రం మౌనంలో నుంచి బయటకు వచ్చి కేసు వాపసు తీసుకోమని రేవంత్‌రెడ్డికి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంతకుమించి ఈ విషయంలో చంద్రబాబు చేయగలిగింది, మాట్లాడగలిగింది ఏమీ లేదు. జాతీయ అధ్యక్షుల వారు స్పందించకపోయినప్పటికీ దేశంలోకెల్లా రాజకీయ చైతన్యం విషయంలో ఒకడుగు ముందే ఉండే తెలుగు ప్రజలకు అసలు రంగులు తెలియకుండా ఉంటాయంటారా?