విశాఖలో జరిగిన ‘రంగస్థలం’ వేడుకలో చిరంజీవి మాట్లాడిన ఓ మాట సోషల్ మీడియాలో కాస్త ఆలస్యంగా దుమారం రేపుతోంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’కు అవార్డులు రావడం ఖాయమని చెప్పిన చిరు, ఒకవేళ జాతీయ స్థాయిలో అవార్డులు రాకుంటే అన్యాయం జరిగినట్టే అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఇవ్వబోయే అవార్డుల, అందులో తనయుడి సినిమాకు అవార్డులు రాకపోతే అన్యాయమని ముందుగా నిర్ణయానికి వచ్చిన మెగాస్టార్‌కి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కనిపించడం లేదా? అని సోషల్ మీడియా సాక్షిగా కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘రంగస్థలం’ మీద వున్న ప్రేమ రాష్ట్రం మీద లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రదేశ్ సినిమావాళ్ళు ప్రత్యేక హోదా కోసం ఎందుకు గళం విప్పడం లేదని ప్రశ్నించిన తర్వాత చిరంజీవి మీద ఫోకస్ పెరిగింది. రాజకీయాలతో ఆయనకు సంబంధం వుంది కనుక. ఒకప్పుడు రాజకీయాలతో రాసుకు పూసుకు తిరిగారు కనుక. తప్పో ఒప్పో రాజకీయాల్లో వున్న చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా అంశంలో ఏదో ఒక మాట మాట్లాడుతూనే వున్నారు. కొంత కాలంగా రాజకీయాలకు వీలైనంత దూరంగా వుంటోన్న చిరంజీవి, ప్రత్యేక హోదా అంశంలో మాట్లాడతారని ఆశించడం అత్యాశే. ఆయన ఒక్కరే కాదు… తెలుగు హీరోలు, నిర్మాతలు ఎవరూ నోరు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. ఎక్కడో పోసాని కృష్ణమురళి, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో పోసాని తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.