ఇండియన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ మెంబర్స్ సమావేశమైనప్పుడల్లా ఓ రొటీన్ డైలాగ్ వినిపిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల స్థాయిలో ఇండియన్ టీం కూడా అత్యున్నతంగా పెర్ఫార్మ్ చేసేలా చేయడమే మా లక్ష్యం అని మాటలు చెప్తారు. అందుకే అత్యుద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాళ్ళనే టీంలోకి తీసుకుంటూ ఉంటామని చెప్తూ ఉంటారు. కొందరు ఆటగాళ్ళ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు కూడా. వి.వి.ఎస్. లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లాంటి వాళ్ళను ఒక సిరీస్‌లో విఫలమవగానే నిర్ధాక్షిణ్యంగా, అవమానకరంగా ఇంటికి పంపించేశారు. వీరేంద్ర సెహ్వాగ్‌కి కూడా అలాంటి అనుభవాన్నే రుచి చూపించారు. అలాంటి టైంలో సెలక్టర్స్ చెప్పే కారణాలు కూడా సవ్యంగానే అనిపిస్తాయి.
మరి అదే సెలక్టర్స్ సురేష్ రైనా, శిఖర్ధావన్ల విషయంలో మాత్రం పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రైనా, ధావన్‌లకు ఇచ్చినన్ని అవకాశాలు ఇంకెవ్వరికీ ఇచ్చి ఉండరేమో మన సెలక్టర్స్, కెప్టెన్స్ అండ్ బిసిసిఐ. రైనా, ధావన్‌లు సాంకేతికంగా చాలా బలహీనం. బౌన్స్ ఉన్న పిచ్, నికార్సయిన ఫాస్ట్ బౌలర్ ఎదురయ్యాడంటే ఇద్దరూ కనీసం క్రీజ్‌లో కూడా నిలబడలేరు. కెరీర్ ప్రారంభంలో ఏ స్థాయి ప్రతిభను ప్రదర్శించారో ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నారు. రహానే, రాహుల్, కోహ్లిల లాగా నేర్చుకుంది, ఆటను మెరుగుపర్చుకోవాలని ప్రయత్నించింది ఏమీ లేదు. కనీసం జాగ్రత్తగా ఆడాలన్న స్పృహ కూడా ఉన్నట్టుగా అనిపించదు. న్యూజిలాండ్‌తో సెకండ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ధావన్ బ్యాటింగ్ చూస్తూ ఉంటే పూజారా, కోహ్లి, రహానే, విజయ్, రాహుల్‌లాంటి అల్టిమేట్ టాలెంట్ ఉన్న ప్లేయర్స్‌తో కలిసి ఆడే అర్హత ధావన్‌కి ఉందా? అని చాలా సార్లు అనిపించింది. ఒకవేళ రైనా, ధావన్‌లకు ప్రత్యామ్నాయాలు లేక టీంలోకి తీసుకుంటున్నారా? అంటే అది కూడా కాదు. యువరాజ్, గంభీర్ల రూపంలో ఇద్దరు టాలెంటెడ్ ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు. యవరాజ్, గంభీర్‌లు చాలా కష్టపడి రంజీల్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఒక్క సిరీస్‌లో ఓ మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తారు. అందులో ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాదు. మిగతా రెండు మ్యాచ్‌లలో వేటు కత్తి మెడ మీద వేలాడుతుండగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేయలేకపోతారు. వెంటనే వేటు పడిపోతుంది. ఇక మళ్ళీ రైనా, ధావన్‌ను ఆడినా, ఆడకపోయినా సంవత్సరాల తరబడి ఆడిస్తూనే ఉంటారు. ఇదే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తంతు. టీనేజర్స్ విషయం పక్కన పెడితే క్రికెట్ పైన ఇష్టం, గౌరవం ఉన్నవాళ్ళకు ఇలాంటి బిసిసిఐ చెత్త రాజకీయాలే చిరాకు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ టీంలోకి తీసుకున్న గంభీర్‌కి కనీసం చివరి టెస్ట్‌లోనైనా ఆడే అవకాశం ఇస్తారో లేదో చూడాలి మరి.