ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని అని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్యాకేజీతో మోసం చెయ్యొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు అంటూ ఉద్యమిస్తామని ప్రకటించారు. దీన్లో భాగంగా తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చివరిరోజు వరకూ వేచి చూసి, అప్పటికీ కేంద్ర వైఖరిలో మార్పు రాకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని, ఇదే చివరి అస్త్రమని జగన్ అంటున్నారు. ఇంతకీ.. రాజీనామాలు చేసేందుకు ఏప్రిల్ 6 వరకూ ఆగాల్సిన అవసరం ఏముందంటే.. మార్చి 1 నుంచి ఏప్రిల్ 5 వరకూ రాష్ట్రంలో వరుసగా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు కాబట్టి! అయితే, ఈ నెల రోజుల్లో వైకాపా చేయబోతున్న కార్యక్రమాలకు కేంద్రం దిగొచ్చే పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న..?
ఏప్రిల్ 5 వరకూ ఆగినా.. కేంద్రం వైఖరిలో మార్పు వచ్చే పరిస్థితులు దాదాపు కనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు వైకాపా అడుగుతున్నది ఆంధ్రాకి ప్రత్యేక హోదా! నిజానికి, దీని గురించి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని జగన్ అడగొచ్చు కదా. ఎందుకంటే, భాజపా అడక్కుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించి, పాదాభివందనాలు చేశారు. కనీసం ఆ కృతజ్ఞతతోనైనా ప్రత్యేక హోదా ఇవ్వండీ అని నేరుగా జగన్ కేంద్రాన్ని కోరొచ్చు. కానీ, ఆపని చెయ్యరు! ఆంధ్రాకు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం కేంద్రమే అనేది అందరికీ తెలిసిన విషయం. ఆంధ్రాకి ఇస్తే మరో రాష్ట్రం అడుగుతుందనీ, ఇంకో రాష్ట్రం ఒత్తిడి పెంచుతుందనీ రకరకాల కారణాలు చెప్పి… 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అంటూ దానికో సపోర్టింగ్ వాదన తీసుకొచ్చి.. హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇంత జరిగినా, హోదా ఇవ్వకపోవడానికి కారణమైన మోడీ సర్కారును ఇంతవరకూ జగన్ ప్రశ్నించింది లేదు, ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా ఘాటుగా విమర్శించింది లేదు. యువభేరి కార్యక్రమాలు, దీక్షలు చాలా చేపట్టామనీ, హోదా సాధనకు అలసట లేని పోరాటం చేస్తున్నామని జగన్ చెప్పుకుంటున్నా… ఆ హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని మాత్రం జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదనేదే ప్రశ్న..?
ఏప్రిల్ 6 లోపు కేంద్రం స్పందించే స్థాయి ఒత్తిడి వైకాపా ఎలా పెంచగలదు..? ఆంధ్రాలో నిరసనలు చేస్తే.. ఢిల్లీలో స్పందన వస్తుందా..? భాజపా పాయింటాఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే.. ఆంధ్రా అనేది వారికో రాజకీయ అవసరం మాత్రమే! వారికి రాజకీయ ప్రయోజనాలు తప్ప, రాగద్వేషాలు ఏముంటాయి, ఎందుకుంటాయి..? ఇది భాజపా వైఖరికి సమర్థింపు వ్యాఖ్య కాదు, కఠిన వాస్తవం. రాజకీయంగా భాజపాకి ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుందని తెలిస్తే తప్ప.. మోడీ సాబ్ దీనికీ స్పందించరు. సంప్రదాయ భాగస్వామ్య పక్షమైన టీడీపీ తమకు దూరమైతే.. ఎన్డీయే నుంచి ఇతర పక్షాలు కూడా పక్కకు తప్పుకునే వాతావరణం ఢిల్లీలో ఏర్పడింది. బడ్జెట్ నేపథ్యంలో జాతీయ స్థాయిలో రాజకీయంగా ఈ రకమైన కదిలకను టీడీపీ తీసుకొచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే, బడ్జెట్ ప్రసంగంలో ఎంత మొండిగా కేంద్రం వైఖరి కనిపించినా, ఆ తరువాత మనసు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ స్థాయి ఒత్తిడి కేంద్రంపై వైకాపా ఎలా తీసుకుని రాగలదు..? ఈ నెలరోజుల్లో ఇతర పార్టీలను కలుపుకుంటుందా..? ప్రతిపక్ష పోరుకు అధికార పార్టీ మద్దతు ఇచ్చే పరిస్థితి తీసుకుని రాగలరా..? ఇలాంటి ప్రశ్నకు వారి దగ్గర సమాధానం ఉంటే… ఓకే..! అంతేగానీ, కేవలం కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తాం, ఢిల్లీలో నిరసనలు చేస్తాం.. అదే మా పోరాటం అనుకుంటే.. ఏప్రిల్ 6 వరకూ రాజీనామాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరమైతే లేదనే అనిపిస్తోంది. ఈలోగానే రాజీనామాలు చేస్తే, జాతీయ స్థాయిలో కొన్ని పార్టీల మద్దతు కోసమైనా ప్రయత్నించొచ్చు.