పాత్రికేయులతో చిట్ చాట్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి భాజపా శాసనసభ పక్ష నేత జి.కిషన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఆయన నటన గురించీ, ఆయన రాజకీయాల గురించీ వ్యాఖ్యలు చేసారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడుగా పనికిరారని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు నటనే సరిగ్గా రాదని, పవన్ హావభావాలు చూస్తే నవ్వొస్తుందన్నారు . తన దృష్టిలో పవన్ కల్యాణ్ కన్నా ఆయన అన్నకొడుకు వరుణ్ తేజ్ మంచి నటుడు అని అభిప్రాయపడ్డారు.
ఈ కామెడీ సరిపోలేదనుకున్నాడో ఏమో, రాజకీయాల విషయం లో కూడా మరి కొన్ని కామెడీ వ్యాఖ్యలు చేసారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో తామే బలమైన శక్తిగా ఎదుగుతామన్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలకి మొండి చేయి చూపిందని ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే, ఆయన తమ పార్టీ తో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించడం, అదీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని చెప్పడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.