ఇది కార్య‌రూపం దాల్చితే ఏపీ భవిష్య‌త్తుకు భ‌రోసా..!

మూడేళ్ల కింద‌ట సీఎం చంద్ర‌బాబు త‌న‌ను క‌లిసి ఏపీ విజ‌న్ గురించి వివ‌రించార‌నీ, అది కార్య‌రూపంలో క‌నిపించిన‌ప్పుడు చూద్దాంలే అనుకున్నాను అని ముఖేష్ అంబానీ అన్నారు. అయితే, ఇప్పుడీ రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని చూశాక‌.. అనుకున్న క‌ల‌ను సాకారం చేశార‌ని సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. రిలయ‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ వెల‌గ‌పూడిలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని చూశాక‌.. ప్ర‌పంచంలోనే ఎక్క‌డా ఇలాంటి వ్య‌వ‌స్థ లేదని మెచ్చుకున్నారు. దీనిపై హ‌క్కులు పొంది, వేరే రాష్ట్రాల‌కు సేవ‌లు అందించ‌డం ద్వారా కొంత ఛార్జీలు ఏపీ వ‌సూలు చేయ్యొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ పర్యటన ప్రధానాంశం.. ఆంధ్రాలో కొన్ని కీల‌క సంస్థల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ల‌తో రిల‌య‌న్స్ ముందుకు రావ‌డం.

తిరుప‌తిలో 150 ఎక‌రాల్లో ఎల‌క్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయ‌డానికి ముఖేష్ అంబానీ సుముఖ‌త వ్య‌క్తం చేశారు. దీనిలో జియోఫోన్లు, బ్యాటరీలు, సెట్ టాప్ బాక్స్ లు వంటివి త‌యారు చేయాల‌న్న‌ది రిల‌య‌న్స్ ప్రతిపాదన. త‌మ ఉత్ప‌త్తుల్లో 80 శాతం ఉప‌క‌ర‌ణాల‌ను ఆంధ్రాలో త‌యారు చేసేందుకు రిల‌య‌న్స్ సింసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం విశేషం. దీంతోపాటు, పెద్దాపురంలో 150 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ముఖేష్ అంబానీ చెప్పారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో 50 ఎక‌రాల్లో డిజిట‌ల్ పార్క్ నిర్మించి.. టెలీకాం, ఐటీ స్టార్ట‌ప్ ల‌కు అనుకూల వాతావ‌ర‌ణం అభివృద్ధి చేస్తామ‌నీ చెప్పారు. అంతేకాదు, అమ‌రావ‌తిని డాటా సూప‌ర్ ప‌వ‌ర్ గా తీర్చిదిద్దడంలో స‌హ‌క‌రిస్తామ‌ని కూడా అంబానీ స్పష్టం చేశారు. ఈ సంద‌ర్బంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ముఖేష్ అంబానీ చెప్పారు. ఓర‌కంగా, చంద్ర‌బాబు నాయుడు ప్రోత్సాహం వ‌ల్ల‌నే ధీరూబాయ్ అంబానీ టెలీకాం రంగంలోకి ప్ర‌వేశించార‌ని, టెలీకాం రంగంలో విప్ల‌వానికి అదే నాందిగా నిలిచింద‌న్నారు.

అన్ని అనుమ‌తులు వ‌చ్చేస్తే మ‌రో రెండు వారాల్లోనే తిరుప‌తి ఎల‌క్ట్రానిక్స్ పార్క్ కి రిల‌య‌న్స్ శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌లు కార్య‌రూపంలోకి వ‌స్తే ఏపీ పారిశ్రామిక భ‌విష్య‌త్తుకు ఇదో భ‌రోసాగా నిలిచే అవ‌కాశం ఉంది. రిల‌య‌న్స్ లాంటి దిగ్గజ సంస్థ భారీ ప్ర‌తిపాద‌న‌ల‌తో ఏపీకి రావ‌డం సానుకూలాంశంగా చూడాలి. ఓప‌క్క కేంద్రం నుంచి రావాల్సిన నిధులు స‌రిగా రాకున్నా, రాష్ట్రం ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా.. ఇలాంటి సంస్థ‌లు ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయంటే దానికి కార‌ణం ఇక్క‌డి పాల‌నా ద‌క్ష‌త అన‌డంలో అతిశ‌యోక్తి లేనే లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.