ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసింది. ప్రేమికుల రోజు కానుకగా మంగళవారం సాయంత్రం మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’ టీజర్ విడుదల చేశారు. ప్రేక్షకుల దృష్టి ప్రియ మీద తప్ప ఇంకెవరిపై పడకుండా దర్శకుడు ఒమర్ టీజర్ కట్ చేశాడు. నిజం చెప్పాలంటే… ఇంటర్నెట్లో ఓవర్ నైట్ ప్రియాకు వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకునేలా టీజర్ కట్ చేశారు. ‘ఒరు ఆదార్ లవ్’ పాటలో ప్రియ కనిపించింది కాసేపే అయినా కుర్రకారు ఆమె హావభావాలకు ఫిదా అన్నారు. జస్ట్ ముప్ఫై సెకన్ల క్లిప్ ఈ అమ్మాయికి ఎంత క్రేజ్ తీసుకొచ్చిందంటే… ఇన్స్టాగ్రామ్లో 2.6 మిలియన్స్ ఫాలో అయ్యేంత! సోమవారం సాయంత్రానికి 1.3 మిలియన్స్ వున్న ఫాలోయర్స్ మంగళవారం సాయంత్రానికి 2.6 మిలియన్స్ అయ్యారు. మంగళవారం విడుదల చేసిన టీజర్లోనూ ప్రియ హావభావాలే హైలైట్ అయ్యాయి. టీజర్లో ప్రియ చేతి వేళ్ళకు ముద్దు పెట్టి హీరోకి గురి పెట్టినా… చూసే కుర్రకారు వాళ్ళ గుండెలకు గురి పెట్టినట్టు ఫీలవుతున్నారు.