‘అఖండ 2’ తరవాత బోయపాటి శ్రీను సినిమా ఎవరితో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నిజానికి అల్లు అర్జున్ తో కలిసి ఆయన ఓ సినిమా చేయాలి. ‘సరైనోడు` తరవాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. బోయపాటి కూడా బన్నీకి ఓ కథ చెప్పారు. కానీ బన్నీ లైనప్ చాలా బలంగా వుంది. ఈమధ్యలో బోయపాటి సినిమాని ఇరికించడం కుదరడం లేదు. దాంతో ఈలోగా బోయపాటి మరో సినిమా చేయాల్సివస్తోంది. తెలుగులో దాదాపు అగ్ర హీరోలంతా బిజీగా ఉన్నారు. యువ హీరోలు బోయపాటి స్టైల్ ఆఫ్ యాక్షన్‌కి సరి తూగడం లేదు. దాంతో ఇప్పుడు బోయపాటి బాలీవుడ్ బాట పట్టడానికి చూస్తున్నారు.
రణవీర్ సింగ్ కోసం బోయపాటి ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా చర్చలు కూడా సాగాయి. ఓ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తో సినిమా చేయాలని రణవీర్ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. మధ్యలో ఒకట్రెండు ప్రయత్నాలు జరిగాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఈసారి మాత్రం బోయపాటితో రణవీర్ సినిమా పక్కా అనే ప్రచారం మొదలైంది. బోయపాటి స్టైల్ కి, రణవీర్ బాడీ లాంగ్వేజ్ కీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కాబట్టి.. ఈ కాంబో వర్కవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
