కన్నడలో వ్యాపార, రాజకీయ ప్రముఖ వారసులు సినిమాలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అలా వచ్చి నిలబడిన వారు పెద్దగా కనిపించడం లేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి కుమారుడు, భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి 2016లో జాగ్వార్ సినిమాతో అరంగేట్రం చేశాడు. చాలా భారీదనంతో ఈ సినిమా వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ కథ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ అందించాడు. మనోజ్ పరమహంస కెమెరామెన్. ఇలా పెద్ద కాన్వాస్‌లో వచ్చిన ఈ సినిమాని జనం పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా నిఖిల్‌కి పెద్ద బ్రేక్ రాలేదు.
ఇప్పుడు మరో కన్నడ వారసుడు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ సినిమాతో వస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. జెనీలియా కీలక పాత్ర. వారాహి చలనచిత్రం నిర్మాణం. దేవిశ్రీ మ్యూజిక్. సెంథిల్ కుమార్ కెమెరామెన్. భారీ సినిమాకు ఉండాల్సిన హంగులన్నీ వున్నాయి.
ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. రాజమౌళిని ప్రీరిలీజ్ ఈవెంట్‌కి తీసుకొచ్చారు. వెయ్యికి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఓ కొత్త హీరో సినిమా వెయ్యికి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందంటే.. తన వారసుడి విషయంలో గాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమౌతుంది. తండ్రిగా తన పని చేశారు. ఇప్పుడంతా ప్రేక్షకుల చేతిలోనే ఉంది. మరి కిరీటికి జనం ఎలాంటి మార్కులు వేస్తారో శుక్రవారం తేలిపోతుంది.