చిరంజీవి అభిమానుల ఆకలి తీర్చిన సినిమా”… ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లెద్దు. సినిమాలు చూడడం మానేసిన మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ‘శంకర వర ప్రసాద్’ని చూడ్డానికి మళ్లీ థియేటర్లకు తరలి వచ్చారు. అందుకే ఇన్ని వసూళ్లు. వింటేజ్ చిరంజీవిని థియేటర్లో మళ్లీ చూసుకోవడం వాళ్లకు మరింత ఆనందాన్ని ఇచ్చింది.
ఓ హిట్ సినిమా వల్ల.. తదుపరి వచ్చే సినిమాలకు ప్లస్ అవుతుంది. మార్కెట్ పరంగా, బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా హిట్ సినిమా తప్పకుండా కలిసి వస్తుంది. అలా.. ‘వర ప్రసాద్’ వల్ల ‘విశ్వంభర’ సినిమాకు మేలు జరగాలి. అయితే ఆ పరిస్థితి ఉందా, లేదా? అనేది అనుమానం. గతేడాదే రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. అయితే సినిమాకు సరైన జబ్ ఏర్పడలేదు. ఓటీటీ హక్కులు అమ్ముడుపోలేదు. అన్నింటికంటే ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ‘విశ్వంభర’ని పక్కన పెట్టి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ని విడుదల చేశారు. ‘ప్రసాద్ గారు…’ హిట్ అయితే ఆ హీట్ `’విశ్వంభర’కు ప్లస్ అవుతుందని అనుకొన్నారు. కానీ ఆ దాఖలాలు కనిపించడం లేదు. `విశ్వంభర` రిలీజ్ డేట్ పై నిర్మాతలు ఇంకా మీన మేషాలు లెక్కేస్తున్నారు. జూన్ 10న ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అనుకొంటున్నారు. కానీ యూవీ క్రియేషన్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ కాలేదు. ‘విశ్వంభర’ నుంచి కొత్త టీజర్, పాట వస్తే కానీ.. మార్కెట్ పరంగా కదలిక వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సీజీ వర్క్స్ విషయంలో దర్శక నిర్మాతలు, మెగాస్టార్ ఇంకా సంతృప్తిగా లేరని, అందుకే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీకి రాలేకపోతున్నారని తెలుస్తోంది. ముందుగా ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలి. ఆ తరవాత రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు కానీ బిజినెస్ లెక్కలు తేలవు.
