సంక్రాంతి తర్వాత టాలీవుడ్ ఎదురుచూసే సీజన్ సమ్మర్. కొంచెం పెద్ద సీజన్ ఇది. ఐపీఎల్ ప్రభావం వలన వేసవి సినిమా వినోదాల హంగామా కొన్నేళ్ళుగా తగ్గు ముఖం పట్టింది కానీ ఒకప్పుడు ‘వేసవి విడుదల’ అనేది ప్రత్యేక ఆకర్షణ.
ఈ వేసవిలో మార్చి ప్రత్యేకంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ పెద్ది, నాని పారడైజ్ సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి వున్నాయి. ఈ రెండు కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ డేట్లు ఇచ్చాయి. అయితే ఇందులో పారడైజ్ సినిమా అఫీషియల్ గా డ్రాప్ అయిపోయినట్లే. స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్ విషయంలో ఒక కీలక వాఖ్య చేశారు.
‘ పారడైజ్ మార్చిలో తీసుకురాడానికి ప్రయుత్నిస్తున్నాం. అయితే చరణ్ గారి సినిమా వస్తే ఆ సినిమా మీద వేసే పరిస్థితి వుండదు. సమ్మర్ పెద్ద సీజన్. ఈ సమ్మర్ లో చాలా గ్యాప్ వుంది. సినిమాలు పెద్దగా లేవు. నెలకొక పెద్ద సినిమాకి అవకాశం వుంది. క్లాస్ వుండదు’ అన్నారు. ఆయన మాటలు గమనిస్తే చరణ్ పెద్ది వస్తే నాని పారడైజ్ వాయిదా వేయడానికి ఆయన సిద్ధంగా వున్నారు.
పెద్ది, పారడైజ్ రెండూ క్రేజీ సినిమాలే. రెండూ కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. రెండూ ఒకే సమయానికి రావాలని అనుకున్నా ఇప్పటి పరిస్థితులు ప్రకారం ఇందులో ఒక్క సినిమానే వచ్చే అవకాశం వుందని సుధాకర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. సుధాకర్ నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. వారి మధ్య మంచి స్నేహం వుంది. ఎట్టిపరిస్థితిలో చరణ్ సినిమాపై పారడైజ్ ని వేసే ఆలోచన ఆయనకు లేదని అర్ధమౌతుంది.
