తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ ప్రచారం చేయబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా లోకల్ ఫ్లేవర్. భారీగా క్రౌడ్ పుల్లర్స్ అవసరం లేదు. కానీ బీజేపీ అనూహ్యంగా పవన్ కల్యాణ్ ను ప్రచారానికి ఒప్పించింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఆంధ్ర ముద్ర వేస్తోంది. రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని అంటోంది.ఇటీవల పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలు ఒక్క సారిగా మళ్లీ హైలెట్ చేస్తున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి మేలు చేస్తాయా.. నష్టం చేస్తాయా?
యువత, సామాజిక సమీకరణాలు చూసుకుంటున్న బీజేపీ
బీజేపీ వ్యూహం ప్రకారం, పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల ముఖ్యంగా యువత , సెటిలర్ల ఓట్లు పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరగడం లేదు. శివారు మున్సిపాలిటీల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. వారిని ఆకట్టుకోవడానికి పవన్ ఒక క్రౌడ్ పుల్లర్ గా ఉపయోగపడతారని బీజేపీ భావిస్తోంది. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ ఆయనపై ఆంధ్రా ముద్ర వేయడం బీజేపీకి ప్రతిబంధకంగా మారవచ్చు. కాంగ్రెస్ పార్టీ పవన్‌ను లక్ష్యం చేసుకోవడం వెనుక స్పష్టమైన కారణం ఉంది. పవన్ గతంలో చేసిన దిష్టి వ్యాఖ్యలను మ, ఇతర వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి, తెలంగాణ ఆత్మగౌరవానికి ముడిపెట్టడం ద్వారా స్థానిక ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తోంది.
రిస్క్ ఎందుకు తీసుకుంటోంది?
మరోవైపు బీఆర్ఎస్ మౌనంగా ఉండటం కూడా వ్యూహమే. బీజేపీ-పవన్ కలయిక వల్ల వ్యతిరేక ఓటు చీలితే, అది తమకు లాభిస్తుందని లేదా సెంటిమెంట్ పండకపోతే సైలెంట్‌గా ఉండటమే మేలని గులాబీ దళం భావిస్తూ ఉండవచ్చు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ కొన్ని చోట్ల తక్కువగా ఉంది. అటువంటి చోట్ల పవన్ గ్లామర్ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువస్తుందని ఆ పార్టీ నమ్మకం. పైగా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవడానికి ఏదో ఒక సెన్సేషన్ సృష్టించడం బీజేపీకి అవసరం. సెంటిమెంట్ బెడిసికొట్టే ప్రమాదం ఉన్నప్పటికీ, బలమైన హిందుత్వ ఓటు బ్యాంకుతో పాటు జనసేనాని మద్దతుదారులు కలిస్తే గెలుపు సులభమవుతుందనేది వారి లెక్క.
గ్రేటర్ వెలుపల ప్రభావం ఎంత?
గ్రేటర్ పరిధిలో అయితే పవన్ ప్రభావం స్పష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ ఫ్లేవర్ ఎక్కువ. పవన్ ప్రచారం చేసే రెండు రోజుల్లో ఆయన ప్రసంగాలు కేవలం పొలిటికల్ పంచ్‌లకే పరిమితమైతే బీజేపీకి నష్టం జరగవచ్చు. అలా కాకుండా, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడితే కొంత మేర సానుకూలత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ ప్రయోగం బీజేపీకి ప్లస్ అవుతుందో లేక సెంటిమెంట్ సెగతో మైనస్ అవుతుందో ఫలితాలే తేల్చాలి.
