‘కన్నప్ప’ భారమంతా ఇప్పుడు ప్రభాస్ ఒక్కడే మోస్తున్నాడు. ఈ సినిమాలో చాలామంది స్టార్లు ఉన్నారు. కానీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేది మాత్రం ప్రభాస్ మాత్రమే. ఈ విషయం విష్ణుకి కూడా తెలుసు. అందుకే ట్రైలర్లో ప్రభాస్‌పై ఎక్కువ షాట్లు వచ్చేలా చూసుకొన్నాడు. తన పాత్ర దాదాపు అరగంట ఉంటుందని, తన కెరీర్లో తప్పకుండా గుర్తుండిపోయే సినిమా అవుతుందని పదే పదే చెబుతున్నాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకకూ ప్రభాస్ వస్తాడనే ఆశల్లో ఉన్నాడు.
శనివారం హైదరాబాద్ లో కన్నప్ప ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది. ఈ వేడుకలో చిత్రబృందం అంతా పాల్గొంటారు. ప్రభాస్ కూడా వస్తాడని టీమ్ ఆశ పడుతోంది. ఇప్పటికే మోహన్ బాబు స్వయంగా ప్రభాస్‌కు ఫోన్ చేసి ఈవెంట్ కు ఆహ్వానించారని తెలుస్తోంది. ప్రభాస్ – మోహన్ బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకోసమే కన్నప్పలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకొన్నాడు. ఈసారీ ఆ సెంటిమెంట్ బలంగా పని చేస్తుందని మోహన్ బాబు, విష్ణు నమ్ముతున్నారు.
కాకపోతే.. ఈమధ్య ప్రభాస్ సినిమా వేడుకల్లో కనిపించడమే మానేశాడు. తన సినిమా ‘రాజాసాబ్’ టీజర్ లాంచ్‌కే ప్రభాస్ రాలేదు. అలాంటిది `కన్నప్ప`కు వస్తాడా? అనేది పెద్ద ప్రశ్న. వస్తే మాత్రం కచ్చితంగా `కన్నప్ప`కు భారీ బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు కూడా పండగే.