ఈసారైనా నాణ్య‌మైన బ‌తుక‌మ్మ చీర‌లు ఇస్తారా..?

KTR

మ‌రోసారి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీకి తెలంగాణ స‌ర్కారు సిద్ధ‌మైంది. ఇదే అంశాన్ని పుర‌పాల‌క శాఖ‌మంత్రి కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ లో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ… గ‌డ‌చిన రెండేళ్లుగా తెలంగాణ ఆడ‌ప‌డుచులకి బ‌తుక‌మ్మ చీర‌లను ప్ర‌భుత్వం కానుక‌గా ఇస్తోంద‌నీ, ఇది మూడో సంవ‌త్స‌ర‌మ‌నీ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రోత్స‌హిస్తూ, ఇంకోప‌క్క నేత‌న్న‌ల‌కు భ‌రోసా ఇచ్చే విధంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఈనెల 23 నుంచి చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మౌతుంద‌న్నారు. గ్రామ‌స్థాయిలో స‌ర్పంచులు, గ్రామ కార్య‌ద‌ర్శులతో ఏర్ప‌డ్డ క‌మిటీలు చీర‌ల పంపిణీ చేస్తాయ‌నీ, ఎమ్మెల్యేలూ ఎమ్మెల్సీలూ వారి నియోజ‌క వ‌ర్గాల్లో చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని చెప్పారు. బ‌తుక‌మ్మ చీర‌ను ఒక బ్రాండ్ గా చేసి, త్వ‌ర‌లో మార్కెట్లో కూడా ఇవి ల‌భ్య‌మ‌య్యేలా కృషి చేస్తామన్నారు.

ముందుగా మీడియాకి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు కేటీఆర్! ఎందుకంటే, బ‌తుక‌మ్మ చీర‌లు త‌యారౌతున్న సిరిసిల్ల‌కు వెళ్లి, ఈ చీర‌ల‌కు సంబంధించిన క‌థ‌నాలు ముందుగానే ప్ర‌సారం చేసి ప్ర‌చారం క‌ల్పించినందుకు అన్నారు! ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు అన్నారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని బ‌తుక‌మ్మ చీర‌ల విష‌యంలో ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్టున్నారు మంత్రి కేటీఆర్! ఎందుకంటే, గ‌తంలో పంపిణీ చేసిన చీర‌ల నాణ్య‌త‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంతేకాదు, కొన్ని చోట్ల మ‌హిళలు స్వ‌చ్ఛందంగా రోడ్ల మీద‌కి వ‌చ్చి.. ప్ర‌భుత్వం ఇచ్చిన చీరల‌ను రోడ్ల మీద ప‌డేసిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్ర‌భుత్వం ఇచ్చిన చీర‌ల‌ను త‌గుల‌బెట్టిన అనుభ‌వాలూ ఉన్నాయి.

ఈసారి నాణ్య‌త విష‌యంలో ప్ర‌భుత్వం కొంత జాగ్ర‌త్తప‌డ్డ‌ట్టుగానే క‌నిపిస్తోంది. అందుకే ఈసారి ప‌ది ర‌కాల డిజైన్లు, ప‌ది ర‌కాల రంగుల్లో.. అంటే, 100 ర‌కాల చీర‌లంటున్నారు. జాగ్ర‌త్త‌ప‌డ‌కపోతే… ఈసారి ఇదో రాజ‌కీయాంశం చేసేందుకు, పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసేందుకు ఎదురుచూస్తున్న రాజ‌కీయ‌ పార్టీలూ లేక‌పోలేదు! అందుకే, మీడియాకి ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం ద‌గ్గ‌ర్నుంచీ నాణ్య‌త వ‌ర‌కూ అన్నింటా కాస్త జాగ్ర‌త్త‌గా ఉన్న‌ట్టే కేటీఆర్ మాట్లాడారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com