భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పేశారు. వాళ్ల నిష్క్రమణతో టెస్ట్ క్రికెట్ లో ఓ శకం పూర్తయినట్టే భావిస్తోంది క్రీడా లోకం. ఇది వరకే టీ20ల నుంచి నిష్క్రమించిన వీరిద్దరూ ప్రస్తుతం వన్డేలపై ఫోకస్ చేస్తున్నారు. 2027 వరల్డ్ కప్ ఆడడమే వీరిద్దరి ధ్యేయం. అయితే అది అనుకొన్నంత సులభం కాదన్నది విశ్లేషకుల మాట. వన్డే ఫార్మెట్ ని టీ20 డామినేట్ చేసింది. వన్డేలైనా సరే, టీ 20 తరహాలో దూకుడుగా ఆడాలి. పైగా యువతరం నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే జట్టులో స్థానం కోసం కోహ్లీ, రోహిత్ శర్మలు కఠోరంగా పోరాడాల్సిందే. గిల్, అభిషేక్ శర్మ, సుదర్శన్.. వీళ్లంతా గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఓపెనింగ్ స్థానం కోసం అయితే బెర్తులే ఖాళీగా లేవు. రోహిత్ ఓపెనింగ్ కి తప్ప మరో స్థానానికి ఫిట్ అవ్వలేడు. తన ఫిట్ నెస్ కూడా అంతంత మాత్రమే. కోహ్లీ స్థానానికీ పోటీ మామూలుగా లేదు. కోహ్లీ వయసు 36. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు కూడా. 3,4వ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. కానీ అక్కడ కూడా యువతరం నుంచి పోటీ ఉంది.
2027 వరల్డ్ కప్ వరకూ కోహ్లీ, రోహిత్ జట్టులో ఉండడం కష్టమని, వాళ్లు 2027 వరల్డ్ కప్ ఆడలేరని సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ అనేది ప్రతిష్టాత్మకమని, సీరియర్ల అండ ఉండాల్సిందేనని, కానీ యువతరం ప్రభావం గట్టిగా ఉంటుందని, వాళ్లతో పోటీ పడే శక్తి కోహ్లీ, రోహిత్‌లకు ఉండకపోవొచ్చని జోస్యం చెప్పాడు. రాబోయే రెండేళ్లలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ధాటిగా ఆడి, సెంచరీల మీద సెంచరీలు చేస్తే తప్ప వాళ్లకు స్థానం ఉండకపోవొచ్చని, సెలక్టర్లు ఈ విషయంలో చాలా నిశితంగా ఉంటారని, ఒకవేళ యువతరానికి ధీటుగా భీకరమైన ఫామ్ కొనసాగిస్తే, వీరిద్దర్నీ ఆ దేవుడు కూడా తప్పించలేడని వ్యాఖ్యానించారు సునీల్ గవాస్కర్.
కోహ్లీ, రోహిత్‌ల లక్ష్యం 2027 వరల్డ్ కప్ మాత్రమే. అప్పటి వరకూ జట్టులో ఉండాలన్నది వాళ్ల ఆశ. ఈలోగా ఫిట్ నెస్ కాపాడుకోవాలి. ఫామ్ ని మెరుగు పరచుకోవాలి. ఒకవేళ 2027 వరల్డ్ కప్ లో ఆడలేమని వీరిద్దరూ భావిస్తే, మధ్యలోనే నిష్కృమించే అవకాశం ఉంది. రోహిత్ మాటేమో గానీ, విరాట్ మాత్రం ఫామ్ లో లేకపోతే తనంతట తానే గుడ్ బై చెప్పేస్తాడు. ”నా గురించి నాకు బాగా తెలుసు. జట్టుకు నేను ఉపయోగపడలేను అనిపించిన మరుక్షణం నాకు నేనే వైదొలుగుతాను. పోరాడే తత్వం, గెలవాలన్న కసి లేనప్పుడు జట్టులో ఉండి లాభం ఏముంది? అలా ఎప్పుడు అనిపించినా నా వీడ్కోలు లేఖ సిద్ధంగానే ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు విరాట్.