భారతీయ మహిళల ఆర్థిక ఆలోచనా దృక్పథంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లపై మొగ్గు చూపే మహిళలు, ఇప్పుడు స్థిరాస్తి రంగం వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. అనరాక్ సంస్థ 2026 మార్చిలో విడుదల చేసిన తాజా కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే ప్రకారం, దేశంలోని సుమారు 66 శాతం మంది మహిళలు తమ మొదటి పెట్టుబడి ఎంపికగా రియల్ ఎస్టేట్‌ను ఎంచుకుంటున్నట్లు స్పష్టమైంది. గత ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయింది.
ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో మహిళా గృహ కొనుగోలుదారుల సంఖ్య గత ఏడాది కంటే గణనీయంగా పెరిగింది. ఈ నగరాల్లో ఉద్యోగం చేస్తున్న మహిళలు అద్దె ఇళ్ల కంటే సొంత ఇంటిని కలిగి ఉండటం సామాజికంగా, ఆర్థికంగా భద్రతనిస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ రంగంలో పనిచేస్తున్న యువతులు, వివాహానికి ముందే తమ పేరిట ఫ్లాట్లను బుక్ చేసుకుంటున్న ట్రెండ్ 2026లో మరింత ఊపందుకుంది. పెట్టుబడి విలువ పరంగా చూస్తే, మహిళలు కేవలం సరసమైన ఇళ్లకే పరిమితం కాకుండా, లగ్జరీ ఇళ్ల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది మహిళలు రూ.90 లక్షలకు పైబడిన ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2019లో ఈ సంఖ్య కేవలం 25 శాతంగానే ఉండగా, పెరిగిన ఆదాయ వనరులు మరియు ఆర్థిక స్వేచ్ఛ కారణంగా ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకుంది. ఇందులో 10 శాతం మంది మహిళలు రూ.2.5 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన విల్లాలను ఎంచుకున్నారు.
మహిళలు రియల్ ఎస్టేట్‌ను ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. స్థిరమైన అద్దె ఆదాయం, దీర్ఘకాలిక మూలధన వృద్ధి , పన్ను మినహాయింపులు. ప్రభుత్వం అందించే స్టాంప్ డ్యూటీ రాయితీలు కూడా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్లు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. 2026లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో మహిళలు కేవలం నిర్ణేతలు గానే కాకుండా, పెట్టుబడిదారులు గా కీలక పాత్ర పోషిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
