కథ లేకపోతే.. సినిమానే లేదు అని చెబుతుంటారు కానీ, కథా రచయితకు, అసలు రచయిత అన్నవాడికీ పరిశ్రమలో కనీస గౌరవం దక్కుతోందా? అనిపిస్తుంటుంది. ‘సరస్వతి’ అనే సినిమా గురించీ, ఈ సినిమాకు పని చేసిన బుర్రా సాయిమాధవ్ కు జరిగిన అన్యాయం గురించిన ఆవేదన ఇది.
టాలీవుడ్ లో అగ్రశ్రేణి రచయితల్లో బుర్రా సాయిమాధవ్ ఒకరు. ఆయనకు దర్శకత్వం చేయాలని కూడా ఉంది. కానీ రచయితగా బిజీ అయిపోవడం వల్ల కుదరడం లేదు. దర్శకుడిగా ఎంట్రీ ఇద్దామని ‘సరస్వతి’ అనే కథ రాసుకొన్నారు. స్క్రిప్టు మొత్తం సిద్దం చేసుకొని, వరలక్ష్మి శరత్ కుమార్ కు వినిపించారు. ఈ సినిమాలో నటిస్తూ, నిర్మించడానికి ఆమె సిద్ధపడింది. ఈటీవీ విన్ సహకారం కూడా లభించింది. బుర్రా దర్శకత్వంలో ప్రాజెక్ట్ మొదలైంది. కానీ కొన్ని రోజులకు ఆయన అనివార్య కారణాల వల్ల బయటకు వచ్చేశారు. దాంతో దర్శకత్వ బాధ్యతలు వరలక్ష్మినే తీసుకోవాల్సివచ్చింది. అక్కడి వరకూ బాగానే ఉంది.
కానీ రచయితగా బుర్రాకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదు. పైగా.. ఈరోజు ప్రెస్ మీట్ జరిగితే బుర్రా పేరు ఎక్కడా మెన్షన్ చేయలేదు. పోస్టర్ లో మాత్రం కథా రచయితగా మాత్రమే క్రెడిట్ ఇచ్చారు. డబ్బులు అడుగుతుంటే టీమ్ నుంచి ఎవరూ స్పందించడం లేదని తెలుస్తోంది. ఆఖరికి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా. విచిత్రం ఏమిటంటే.. వరలక్ష్మి కి పేరు తీసుకొచ్చిన రెండు తెలుగు సినిమాలు (క్రాక్, వీర సింహారెడ్డి) చిత్రాలకు బుర్రానే సంభాషణ రచయిత. ఆ ఇష్టంతోనే.. తాను ఇష్టపడి రాసుకొన్న స్క్రిప్టు తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టారు. ఇప్పుడు పారితోషికం ఇవ్వడానికి మీన మేషాలు లెక్క పెడుతున్నారు. చిత్రసీమలో రచయితలకు ఇలాంటి అన్యాయాలు, పెన్నుపోటులు ఎదురవ్వడం మామూలే. కాకపోతే బుర్రాలాంటి స్టార్ రైటర్ విషయంలోనూ ఇలానే ప్రవర్తిస్తారా? అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బుర్రాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే కొత్తవాళ్ల మాటేమిటి?
