సోషల్ మీడియాతో సహా సమాచారసాధనాలు ముఖ్యంగా న్యూస్ టివిలు రగిలించే ఉద్రేకాలు, ఉద్వేగాలు ఆక్రమించుకున్న సగటు మనిషికి ఉరితీయడమే సరైన శిక్ష అనిపించవచ్చు. మరో వైపు మరణదండనే వుండకూడదన్న ఆదర్శం, భారతదేశం అమలు చేస్తున్న చట్టాలు, వీటిని ఆచరించడంలో ధర్మసూక్ష్మాలు యాకూబ్ మెమన్ కు పడిన ఉరిశిక్షమీద భిన్న ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. దీనికి దట్టంగా పులుముకున్న మతం పరిస్ధితిని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.
న్యాయ వ్యవస్థలో లోపాలను, దోష నిర్ధారణలో అసమగ్రతలను, కేసు విచారణపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలను, సమాజంలో అంతరాలను కొనసాగిస్తూ నేరస్తునికి మరణశిక్ష అమలు చేయడం న్యాయమే అవుతుందా?
1993 మార్చి 12 న ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది అమాయకులు బలయ్యారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన, అంగవికలురైన వారి కుటుంబాల ఆవేదన మాటలకు అందనిది. ఆ దుర్ఘటన దేశానిక మాసిపోని ఒక గాయం.
ఈ పేలుళ్ల వ్యూహకర్తలు ఈదేశపు చట్టాలు వర్తించని దేశాల్లో ఆశ్రయం పొంది తప్పించుకొని తిరుగుతుండగా అప్రూవర్‌గా మారేందుకు దేశానికి తిరిగొచ్చి దొరికిపోయిన మెమన్‌కు ఉరి శిక్ష పడింది.
మెమన్ లొంగిపోకుంటే పేలుళ్ల సూత్రదారులు టైగర్ మెమన్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్ర లోకానికి తెలిసేదే కాదు. దేశాన్ని విడిచి వెళ్లిన మెమన్ కుటుంబంలో తిరిగొచ్చింది యాకూబ్ ఒక్కరే. తాను లొంగిపోతానని పాక్ నుంచి సిబిఐని సంప్రదించానని, నేపాల్ సరిహద్దుల్లో లొంగిపోగా, కేంద్ర హోం శాఖ తనను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు చిత్రీకరించిందని మెమన్ మొత్తుకున్నాడు కూడా.
సంఘటనకు బాధ్యులైన వారిని న్యాయపరంగా, చట్టపరంగా విచారించి శిక్షించాల్సిందే. అయితే ఆ టెర్రరిస్టు దాడికి మెమన్ ఒక్కడే బాధ్యుడా? పేలుళ్లలో అతగాడి పాలు ఎంత అనేదే ప్రశ్న. పేలుళ్లలో మెమన్ స్వయంగా పాల్గొనకపోయినప్పటికీ కుట్రదారుల వెనుక ఉన్నాడని సుప్రీంకోర్టే పేర్కొంది. పైగా ఈ కేసులో దర్యాప్తు అధికారులకు లొంగిపోయిన లేదా దొరికపోయిన ఏకైక నిందితుడు, సాక్షి కూడా అతనే. స్వయంగా పేలుళ్లకు పాల్పడకున్నా ఉరి వేయడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, నాగరిక సమాజంలో న్యాయం అనిపించుకుంటుందా? ఇది యాకూబ్ మెమన్ ను ఉరితీయాలన్న వాదనతో ఉద్రిక్తతలు పెంచే రాజకీయశక్తులకు, ఆవొరవడిలో కొట్టుకుపోతున్న మాములు మనుషులు ఆలోచించవలసిన విషయం.
నేరస్తుల మరణశిక్షలు కూడా రాజకీయాలకు కథా వస్తువు కావడం ఆందోళనకరం. ఫలానా దేశం వారు, ఫలానా ప్రాంతం వారు, ఫలానా వారు చేస్తే పెద్ద నేరం, వేరే వాళ్లు చేస్తే కాదు అనే ‘తర్కం’ మరీ ఘోరం. బిజెపి, సంఫ్‌ు పరివార్ తమ సంకుచిత రాజకీయాల కోసం ఉగ్రవాద దుశ్చర్యలను, అందులో పాల్గొన్న దోషులను మత ప్రాతిపదికన విడదీసి చూడటం దారుణం.
పార్లమెంటుపై ఉగ్రవాద చర్య పార్టీలు, మతాలకతీతంగా ఖండించాల్సిన ఘాతుకం. దొరికిన నిందితుడు అఫ్జల్‌గురు ఉరితీత ఆలస్యంపై బిజెపి, పరివారం చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అఫ్జల్‌గురు ఉరి శిక్షకు అర్హుడు కాదని, నేర నిరూపణలో లోపాలు జరిగాయన్న అనుమానాలు, వాదనలు రాజకీయాల మాటున సమాధి అయ్యాయి.
ప్రజల్లోని మతపర మైన భావాలను ఉపయోగించకుని తాము ఉగ్రవాదం పట్ల కఠినంగా ఉన్నామనే భావాన్ని వ్యాపింప చేయడానిక ”నేరస్తుల ఉరి” పై ఉద్యమ స్ధాయిలో వత్తిడి తీసుకురావడం నీచాతినీచం.
పదిహేనేళ్లలో ఉరి శిక్షలు పడ్డ 373 మందిలో 93 శాతానిపైగా పేదలేని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మరణశిక్ష పడ్డవారిలో మూడొంతుల మంది వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం. వీరికే కఠిన శిక్షలు పడటానికి కారణం సరైన లాయరును పెట్టుకోడానికి, దర్యాప్తును ప్రభావితం చేయడానికి ఆర్థిక స్థోమత లేకపోవడమే. ధనవంతులు చాలా మట్టుకు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. పేదలు దళితులు, మైనార్టీలు కఠిన శిక్షలను ఎదుర్కొంటున్నారు. డబ్బుంటే చట్టం చుట్టం అవుతుందన డానికి ఇదే నిదర్శనం.
లా కమిషన్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ప్రాతిపదికపై ప్యానెల్ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఎపి షా ఉరిశిక్షను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉరి శిక్ష రద్దుపై సుప్రీం కోర్టుకు తన నివేదిక ఇవ్వబోతున్నారు.